భద్రాద్రి కొత్తగూడెం, మే 3 (నమస్తే తెలంగాణ): ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, వయసురీత్యా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ పోలింగ్ కేంద్రానికి రాలేని వారి కోసం ‘హోం ఓటింగ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక జిల్లావ్యాప్తంగా 50 రూట్లలో 41 బృందాలను నియమించడంతో వారు ఓటర్ల ఇంటికి వెళ్లి ఓట్లు వేయించారు. శుక్రవారం నుంచి ఈ నెల 8 వరకు హోం ఓటింగ్ జరగనున్నది. జిల్లాలో వృద్ధులు, దివ్యాంగులు 865 మంది ఉన్నట్లు గుర్తించారు. తొలిరోజు చర్ల ప్రాంతంలో హోం ఓటింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓటర్లకు ఎపిక్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లావ్యాప్తంగా 78,890 మందికి కార్డులు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు 77,001 మందికి పంపిణీ చేశారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఆయా ఏఆర్వోలు ఇప్పటికే మారుమూల గ్రామాలకు వెళ్లి అవగాహన కల్పించారు.
ఎన్నికల కోసం జిల్లాలో 1,163 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు. 1,163 పీవోలు, 1,163 మంది ఏపీవోలు, 2,328 మంది ఓపీవోలను నియమించారు. మైక్రో అబ్జర్వర్లు 240 మంది, 2,250 మంది పోలీస్ సిబ్బంది, అదనపు సిబ్బంది 1,037 మందిని నియమించారు.
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, అధికారులు పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న వారు ఆయా నియోజకవర్గాల్లో ఓటరు ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు హక్కు వినియోగించుకోవాలి. జిల్లాలో 4,696 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఖమ్మం, మే 3: ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో శుక్రవారం నుంచి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభమైందని, ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగనున్నదని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. శుక్రవారం స్థానిక సహకారనగర్‌లో హోం ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 85 ఏళ్లు పైబడిన, దివ్యాంగులు, పోలింగ్ కేంద్రానికి రాలేని వారికి ఇంటివద్దకే వచ్చి బ్యాలెట్ పద్ధతిన ఓటుహకు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో మొత్తం 2,504 ఓటర్ల నుంచి 12డీ ద్వారా దరఖాస్తు స్వీకరించి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ చేపడుతున్నట్లు తెలిపారు. ఏరోజుకారోజు పోలైన, పోల్ కానీ పోస్టల్ బ్యాలెట్లను సంబంధిత సహాయ రిటర్నింగ్ అధికారికి అందజేస్తారని, సహాయ రిటర్నింగ్ అధికారి పూర్తి భద్రతతో వాటిని భద్రపరుస్తారని తెలిపారు. సహాయ రిటర్నింగ్ అధికారి, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ స్వామి, అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల విధుల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటుహకును వినియోగించుకోవాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. పాలేరు, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. రాజకీయ పార్టీల ఏజెంట్లకు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ గురించి వివరించారు. త్వరితగతిన ఓటింగ్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాలు, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.