ఖమ్మం, మే 21: ఉమ్మడి నల్గొండ – ఖమ్మం – వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ఓ నయా నయీం అని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆరోపించారు. ప్రజలను బ్లాక్మెయిల్ చేయడం, బూతులు మాట్లాడటం అతడి నైజమని అన్నారు. అలాంటి వ్యక్తికి మండలిలో కూర్చునే అర్హత లేదని స్పష్టం చేశారు. అతడికి ఓటు వేస్తే బ్లాక్ మెయిలర్కి వేసినట్లేనని తేల్చిచెప్పారు. ఖమ్మంలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శానసమండలిలో గొప్పగొప్ప వ్యక్తులు ఉంటారని అన్నారు. ఇదే నయోజకవర్గం నుంచి గతంలో చుక్కా రామయ్య, రాజు, దిలీప్‌కుమార్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి లాంటి వారు ఎన్నికై మండలికి గౌరవం తెచ్చారని గుర్తుచేశారు. అలాంటి మండలిలో బ్లాక్ మెయిలర్ మల్లన్న కూర్చుంటే మండలికి ఉన్న గౌరవం పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టభద్రులందరూ విజ్ఞతతో ఆలోచించి ఈ ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్ విద్యలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రాకేశ్‌రెడ్డి.. అమెరికాలో ఉద్యోగం చేసేవాడని అన్నారు. స్వరాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే ఇక్కడికి వచ్చారని, దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయనను దీవించి పంపారని గుర్తుచేశారు. అతడు మాత్రమే మండలిలో ప్రశ్నించే గొంతుక అవుతాడని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులు పండించిన అన్ని రకాల వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాలని, ప్రతి గింజనూ అలాగే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత నెల 21న సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విధంగా అన్ని రకాల వడ్లకూ బోనస్ ఇవ్వకుండా కేవలం సన్న రకాలకే బోనస్ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ విధానాలను రైతులు గమనించాలని కోరారు. కాంగ్రెస్ పాలకులు ప్రతి విషయంలోనూ అబద్ధమాడతారనేందుకు ఇదే నిదర్శనమని స్పష్టంచేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీనే నెరవేర్చే పరిస్థితి లేకపోవడం దారుణమని అన్నారు.
తెలంగాణ ఏర్పడకముందు రైతుల పరిస్థితి ఎలా ఉందో, పదేళ్ల కేసీఆర్ పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉందో, ఇప్పటి కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉందో రాష్ట్రంలోని అన్నదాతలందరికీ తెలుసునని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు ఇవ్వబోతే కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని అన్నారు. కానీ అదే కాంగ్రెస్ పాలకులు తాజా పార్లమెంటు ఎన్నికలకు ముందు రైతుబంధు ఎలా వేశారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం అనర్హులకు రైతుబంధు ఇస్తోందంటూ గగ్గోలు పెట్టిన కాంగ్రెస్ పాలకులు.. మొత్తానికి రైతుబంధు లబ్ధిదారుల్లో 97 శాతం మంది చిన్న సన్న కారు రైతులే ఉన్నారన్న విషయాన్ని గుర్తించారని అన్నారు. రూ 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి.. 150 రోజులు అవుతున్నా దానిని అమలు చేయలేదని విమర్శించారు. కానీ తన క్యాబినెట్లో ఉన్న ఇద్దరు మంత్రులకు మాత్రం బిల్లులు మొత్తం చెల్లించారని ఆరోపించారు. రుణమాఫీ చేయకుండా దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులు కూరాకుల నాగభూషణం, వీరూనాయక్, మందడపు శంకర్రావు, పగడాల నరేందర్, బెల్లం వేణుగోపాల్, డోకుపర్తి సుబ్బారావు పాల్గొన్నారు.