భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సైతం ఓటర్ల జాబితాను ఫైనల్ చేసింది. 6వ తేదీన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు దానిపై అభ్యంతరాలను స్వీకరించి జాబితాను రూపొందించారు. జడ్పీ డిప్యూటీ సీఈవో చంద్రశేఖర్ తోటి ఉద్యోగులతో కలిసి ఓటర్ల జాబితాను నోటీసు బోర్డుపై ఉంచారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధమంటూ పంచాయతీరాజ్ అధికారులు తమ తమ పనుల్లో నిమగ్నమయ్యారు.
జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ఓటర్ల డ్రాఫ్ట్ విడుదల చేసిన అధికారులు.. జిల్లాలో 6,69,048 మంది ఓటర్లు ఉన్నట్లుగా గుర్తించారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత మరికొందరు ఓటర్లు పెరిగే అవకాశం ఉంది. పురుషులు 3,25,045 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 3,43,979 మంది, ఇతరులు 24 మంది ఉన్నారు. జిల్లాలో 22 జడ్పీటీసీ స్థానాలు ఉండగా.. ఎంపీటీసీ స్థానాలు 233 ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు 1,271 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి అయితే నోటిఫికేషన్ తర్వాత అధికారులు అన్ని ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.