తిరుమలాయపాలెం, మార్చి 12 : ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బచ్చోడు కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బచ్చోడు సెంటర్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రజలు బుధవారం గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు పలువురు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే బచ్చోడు కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
రాష్ట్రంలో కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం బచ్చోడు కేంద్రంగా కొత్త మండలాన్ని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. దీనిపై ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి తక్షణమే కొత్త మండలం ఏర్పాటుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మండల సాధన కోసం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షలకు పూనుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు తిమ్మిడి హన్మంతరావు, జక్కుల యాదగిరి, తాటికొండ అనంతాచారి, ఎన్నబోయిన వెంకటరమణ, నీరుడు రమేశ్, గుజ్జ రామకృష్ణ, గొర్రెపాటి రామచంద్రు, సైదులు తదితరులు పాల్గొన్నారు.