సత్తుపల్లి/సత్తుపల్లి టౌన్, డిసెంబర్ 3 : ఖమ్మంలో ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యపై కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి 19,463 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొత్తం నియోజకవర్గంలో 2,43,118 ఓట్లకు గాను 2,12,549 ఓట్లు పోలయ్యాయి. వీటిలో తొలిసారిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్లో 1811 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి సాధించగా బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర 873 ఓట్లు సాధించారు. మొత్తం 21 రౌండ్లకు గాను మొదటి రౌండ్లోనే బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యకు 203 ఓట్ల ఆధిక్యం లభించింది.
పోస్టల్ బ్యాలెట్లో సైతం 988 ఓట్ల ఆధిక్యం కాంగ్రెస్ అభ్యర్థి సాధించారు. ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి 23 మంది అభ్యర్ధులు రంగంలో ఉండగా వారెవరికీ చెప్పుకోదగిన ఓట్లు రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థి రాగమయి విజయం సాధించడం పట్ల సత్తుపల్లిలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాణసంచా పేల్చి మిఠాయిలు పంచుతూ సంబురాలు చేశారు.
వైరాటౌన్, డిసెంబర్ 3 : సార్వత్రిక ఎన్నికల్లో వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థ్ధి మాలోతు రాందాస్‌నాయక్ 33069 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు మదన్‌లాల్‌కు 60,868 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి రాందాస్‌నాయక్‌కు 93,913 ఓట్లు పోలయ్యాయి. రాందాస్‌నాయక్ ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ తన విజయానికి కృషి చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.