కారేపల్లి, జనవరి 21 : ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని కోమట్లగూడెం గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ ఎ.జయసుధ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల ఆర్థిక పురోభివృద్ధి పశువుల ఆరోగ్యంపైనా ఆధారపడి ఉంటుందన్నారు. కావునా పాడి పశువులకు సరైన సమయంలో వైద్యం అందించాలని సూచించారు. అనంతరం కారేపల్లి పశువైద్యాధికారి ఇందిర పశువులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. గర్భకోశ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు వివరించారు. వైద్య శిబిరాలను పశువుల యజమానులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ సూపర్వైజర్ వెంకటేష్, గోపాలమిత్రలు సురభి శ్రీకాంత్, రేగళ్ల మంగయ్య, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.