మధిర, డిసెంబర్ 23: నియోజకవర్గ కేంద్రమైన మధిరలో రూ.4.50 కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రజా ప్రయోజనాల కోసం ప్రత్యేక ప్రణాళికతో పట్టణాలను ముందుకు నడిపిస్తున్నారు. ప్రజాసంక్షేమంతోపాటు చిరువ్యాపారుల జీవనోపాధికి పెద్దపీట వేస్తున్నారు. జిల్లాలో మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో వెజ్ అండ్ నాన్‌వెజ్ మోడల్ మార్కెట్ల నిర్మాణానికి రూ.13.50 కోట్లను వెచ్చించారు. ఈ మేరకు మధిరలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఈ మున్సిపాలిటీల్లో కనీస వసతులుండేవి కావు. నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం వినియోగదారులు, సామగ్రి విక్రయించే చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కొన్ని పట్టణాల్లో అయితే రోడ్ల వెంటనే కూరగాయల, మాంసం, చేపలు విక్రయిస్తూ ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ జీవించే వారు. ఈ సమస్యను అధిగమించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యాచరణ అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. తద్వారా ఇటు వినియోగారులకు, అటు చిరు వ్యాపారులకు మేలు చేయాలని తలచింది. ఇందులో భాగంగా ఆధునాతన వసతులతో వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్లను ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది. ఒకే ఆవరణలో సమీకృత మార్కెట్ సముదాయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వ్యాపారులు, వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రధాన పట్టణాలు, మున్సిపాలిటీల్లో అధునాతనమైన వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. దీనిలో భాగంగా ఖమ్మం జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో వెజ్, నాన్‌వెజ్ మోడల్ మార్కెట్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ప్రతీ మార్కెట్ నిర్మాణానికి రూ.4.50 కోట్లు కేటాయించింది. ఈ మేరకు మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీల్లో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్‌వెజ్ మోడల్ మార్కెట్లను మున్సిపాలిటీ కేంద్రాల్లో నిర్మిస్తోంది. మధిర మార్కెట్ నిర్మాణానికి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శంకుస్థాపన చేయగా పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మార్కెట్ ప్రజలకు అందుబాటులో ఉండాలన్న అభిప్రాయం మేరకు మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా స్థలంలోనే దీనిని నిర్మిస్తున్నారు. ఈ మార్కెట్లో ఒకేచోట కూరగాయలు, మాంసం, చేపలు, పండ్లు, పూలు లభ్యం కానున్నాయి. గ్రౌండ్‌ఫ్లోర్‌లో 67, ఫస్ట్‌ఫ్లోర్‌లో 67 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు నిర్మాణాలను పూర్తిచేసేలా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు కూడా నిత్యం ఈ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఈ నిర్మాణాలు పూర్తయితే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.