భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ దుష్టపాలనకు ప్రజలు చరమగీతం పాడేరోజు దగ్గరలోనే ఉందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుతో కలిసి ప్రచారం నిర్వహించారు. కొత్తగూడెం 28వ డివిజన్, పాల్వంచలో 11, 12, 13, 25, 49వ డివిజన్లు, సుజాతనగర్లో 22, 23వ డివిజన్లలో విసృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ రెండూ పార్టీలు ఒకటేనని, ప్రాంతీయ పార్టీలను అణగదొక్కాలని చూస్తున్నాయన్నారు.
అమలుకాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల్లో గెలవలేక బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసులు పెడుతుందని విమర్శించారు. ప్రజలకు ఇది మంచి అవకాశమని, ఓటు ద్వారా కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. డబ్బు సంచులతో ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్ నాయకులకు బాకీకార్డులు చూపించి నిలదీయాలన్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో పరువు పోగొట్టుకున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో సైతం ఘోర పరాజయం పాలవబోతున్నారని అన్నారు. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఓటర్లు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోతుందని కేసీఆర్‌నే సీఎం అవుతారని అన్నారు. బీఆర్ఎస్లో పదవులు అనుభవించిన వాళ్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్నారని, వారందరికీ డిపాజిట్లు కూడా రావన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్‌పై గులాబీజెండా ఎగరడం ఖాయమన్నారు. కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు.
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నేతలకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. మండుటెండలో కూడా ప్రచారం చేస్తుండడంతో కార్యకర్తలు మరింత ఉత్సాహంతో ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే ప్రతి డివిజన్లో ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు జోరుగా ఉండడంతో గులాబీశ్రేణులు జోష్ మీద ఉన్నారు.
ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా, పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, రాఘవేంద్రరావులు అన్ని డివిజన్లల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. కొత్తగూడెం రైటర్‌బస్తీ, పాల్వంచ ఆలయంలో ఎంపీ వద్దిరాజు అమ్మవారికి పూజలు చేశారు. ప్రచారంలో నాయకులతోపాటు బీఆర్ఎస్ అభ్యర్థులు పాపగంటి సీతమ్మ, సునిల్, గోవాడ గుణచరిత్, మధుచంద్, మల్లెల స్వప్నకుమారి, మల్లెల రవిచంద్ర, ఫారూక్, సింధుతపస్వి, మీసాల రాజేష్, నాయకులు కాపు కృష్ణ, లక్కినేని సురేందర్, హరిసింగ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.