వైరా టౌన్, జూన్ 14: తెలంగాణను సాధించింది, తీర్చిదిద్దింది ఉద్యమ సారథి కేసీఆరేనని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు పేర్కొన్నారు. ఆయన కృషి వల్లనే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచిందని గుర్తుచేశారు. కొణిజర్ల మండలం అమ్మపాలెంలో ఆదివారం రాత్రి పర్యటించిన వారు.. బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబుతో కలిసి గులాబీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ.. ఎన్నికల హామీల అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా మోసం చేసిందని ఆరోపించారు. రైతుబంధు, పింఛన్లు, కల్యాణలక్ష్మి, తులం బంగారం వంటి హామీలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. అయితే, బీఆర్ఎస్ను అణిచివేసేందుకు కాంగ్రెస్ అనేక కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతోందని అన్నారు. అయినా, కేసులకు భయపడకుండా నాయకులు, కార్యకర్తలు కలిసి పార్టీ కోసం పనిచేస్తున్నారని అన్నారు. అయితే, అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని కోరారు. అలాగే, తదుపరి ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు.
పార్టీ కార్యకర్తలు కూడా ఐక్యంగా పనిచేయాలని కోరారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. దళితుల సమస్యలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. క్రైస్తవ మతం స్వీకరించిన ఎస్సీలకు రిజర్వేషన్ల అంశంపై 1950 నాటి ఉత్తర్వులను సవరించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. యూరియా, పంట కొనుగోళ్ల విషయంలో రైతులను ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని, కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్ష పార్టీగా నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు బూత్‌స్థాయి నుంచి బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు పోట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.