భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 12 (నమస్తే తెలంగాణ): పార్టీ శ్రేణులన్నీ సమన్వయంతో కష్టపడి పనిచేసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ, డైరీల పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన రవిచంద్ర మాట్లాడుతూ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో రెండు మున్సిపాలిటీలు, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేయాలన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి గుర్తులు లేకుండానే బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్‌లు, వార్డు సభ్యుల అభ్యర్థులు విజయం సాధించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ సర్కారు పంచాయతీ ఎన్నికల్లో ఎన్ని అడ్డంగులు సృష్టించినా బీఆర్ఎస్ సత్తా ఏమిటో ప్రభుత్వానికి చూపించామన్నారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచిన చోట డబ్బు ప్రభావంతో మన సర్పంచ్‌లను మభ్యపెట్టారని, అయినా మన వాళ్లంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని అన్నారు. త్వరలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని, ప్రతీ వార్డుకు ముగ్గురు అభ్యర్థుల చొప్పున ఎంపిక చేసిన తర్వాత తుది జాబితాను కేటీఆర్ ఫైనల్ చేస్తారని అన్నారు. పార్టీలో ఎక్కడా గ్రూపులు లేవని, మన గ్రూపు అంతా కేసీఆర్, కేటీఆర్ గ్రూపేనని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు మాట్లాడుతూ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకత్వం బాగా పనిచేస్తున్నదని, సీనియర్ల సూచనలు సలహాలతో ముందుకు వెళితే మరిన్ని విజయాలు సాధించవచ్చన్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు.
మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు ఎన్నో పదవులను సమర్థవంతంగా నిర్వర్తించానని, పార్టీ అభివృద్ధి కోసం చివరి వరకు పనిచేస్తానని స్పష్టం చేశారు. సీనియర్ నాయకులు, బీసీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు క్యాలెండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దిండిగల రాజేందర్, కాపు సీతాలక్ష్మి, సింధు తపస్వి, దళ్‌సింగ్, కిలారు నాగేశ్వరరావు, రాజుగౌడ్, గిరిబాబు, కాంపెల్లి కనకేష్ పటేల్, కొట్టి వెంకటేశ్వర్లు, అన్వర్ పాషా, నవతన్, శాంతి, సోనా, కాపు కృష్ణ, వగ్గెల దామోదర్, అనుదీప్, బీసీ నాయకులు పాల్గొన్నారు.