ఖమ్మం, సెప్టెంబర్ 18: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఖండించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం నగరం 48వ డివిజన్లో కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన అమ్మవారి ఆగమన వేడుకలకు వద్దిరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “కేటీఆర్‌ను ‘బచ్చాగాడు’ అంటూ నేడు సంబోదిస్తున్న పొంగులేటీ.. నాడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆ బచ్చాగాడితోనే స్నేహం చేసిన విషయాన్ని మరిచారా” అని ప్రశ్నించారు. ఆ బచ్చాగాడే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించాడనే విషయాన్ని గుర్తించుకోవాలని హితవు చెప్పారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొంగులేటికి భవిష్యత్తులో ప్రజలే బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు.