న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి చెందిన ఖరీదైన ఇంటిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ముంబైలో రూ.3,716.83 కోట్ల విలువైన విలాసవంతమైన నివాసం ‘అబోడ్’ను మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ అటాచ్ చేసింది. ఈ మేరకు బుధవారం సంబంధిత అధికార వర్గాలు వెల్లడించాయి.
ముంబైలోని పాలీ హిల్‌లో ఈ 17 అంతస్తుల భవనం ఉన్నది. కాగా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) బ్యాంక్ మోసం కేసు విచారణలో భాగంగానే ఈ లగ్జరీ హోమ్‌ను ఈడీ స్వాధీనపర్చుకున్నది. దీంతో ఇప్పటిదాకా ఈ కేసులో ఈడీ జప్తు చేసిన అనిల్ అంబానీ ఆస్తుల విలువ దాదాపు రూ.15,700 కోట్లకు చేరింది. ఈ కేసు విచారణకు సంబంధించి అనిల్ అంబానీ గత ఏడాది ఆగస్టులో ఈడీ ఎదుట తొలిసారి హాజరయ్యారు. ఈడీ ప్రశ్నల్ని మరోసారి అంబానీ ఎదుర్కొనే అవకాశాలున్నాయంటున్నారు.