ఖమ్మం, సెప్టెంబర్ 24: ఉద్యమసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే బతుకమ్మకు ప్రపంచస్థాయి గుర్తింపు లభించిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మను ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్లో పేర్చారు.
ఈ ఉత్సవాలను వారు ప్రారంభించి మాట్లాడారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బతుకమ్మకు ప్రత్యేక నిధులు కేటాయించి తెలంగాణ సంప్రదాయానికి పెద్దపీట వేశారని గుర్తుచేశారు. అనంతరం వర్షంలోనే అక్కడి మహిళలతో కలిసి ఈ నేతలు బతుకమ్మ ఆడారు. పూలపండుగ పాటలకు స్టెప్పులేశారు. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఇతర నాయకులు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.