అదునులో పంటలకు అందించాల్సిన యూరియా కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్నదాతలు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. సమయానికి ఎరువు వెయ్యకపోతే.. ఇన్నాళ్లూ చెమటోడ్చిన పంట చేతికి రాదన్న భయంతో ఎంతటి శ్రమకైనా ఓర్చుతున్నారు. 60 రోజులుగా కొనసాగుతున్న యూరియా కష్టాలకు అంతులేకుండా పోయింది. కానీ, ప్రణాళిక ప్రకారం ఎరువులు తెప్పించి సమయానికి రైతులకు అందించాల్సిన రేవంత్ ప్రభుత్వం మాత్రం చేతులెత్తేసింది. చివరికి అన్నదాతల ప్రాణం మీదకు తెచ్చింది. దీంతో తాజాగా సోమవారం ఉమ్మడి జిల్లాలో ఇద్దరు రైతులు సొమ్మసిల్లి పడిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
ప్రతి రోజూ సరఫరా అవుతున్న కొద్దిపాటి యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో రోజూ వేకువజామున 4 గంటలలోపే సొసైటీల వద్దకు చేరుకుంటున్నారు. చెప్పులు, పాస్ పుస్తకాల జిరాక్స్ కాపీలను క్యూలో పెట్టి పక్కన నిల్చుంటున్నారు. కొందరు రైతులు నేరుగా వేకువజాము నుంచే వరుసలో నిల్చుంటున్నారు. పొద్దెక్కే కొద్దీ ఆకలితో నకనకలాడుతున్నారు. అల్పాహారం కోసంగానీ, భోజనం కోసంగానీ పొరపాటున బయటకు వెళ్తే క్యూ లైన్లో తమ వరుసను ఎక్కడ కోల్పోతామేమోననే భయంతో ఆకలి వేస్తున్నా అలాగే క్యూలో నిలబడుతున్నారు. దీంతో కొందరు రైతులు నీరసించి సొమ్మసిల్లి పడిపోతున్నారు.
నమస్తే నెట్వర్క్, సెప్టెంబర్ 8 : ఏజన్సీ ప్రాంతాల్లోని రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. ఒక్క యూరియా బస్తా కోసం వారు కిలోమీటర్ల కొద్దీ నడుచుకుంటూ వస్తున్నారు. తెల్లవారుజాము కల్లా సహకార సంఘాల వద్దకు చేరుకొని అక్కడ గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. చర్ల మండలంలోని పలు ఏజెన్సీ గ్రామాల రైతులు నెల రోజులుగా తమ పొలం పనులు మానుకొని యూరియా కోసం తిరుగుతున్నారు. చర్ల మండలం సత్యనారాయణపురం సొసైటీ వద్ద సోమవారం యూరియా కోసం వచ్చిన తిప్పాపురం ఆదివాసీ రైతు కారం సోమయ్య క్యూలో నిలబడి సొమ్మసిల్లి పడిపోయాడు. తోటి రైతులు హుటాహుటిన సత్యనారాయణపురం పీహెచ్సీకి తరలించారు.
నేలకొండపల్లిలోనూ కూపన్ల తోపులాటలో ఓ మహిళా రైతు కుప్పకూలింది. నేలకొండపల్లికి చెందిన కూరాకుల మల్లమ్మ అనే మహిళా రైతు అక్కడి రైతు వేదిక వద్ద వ్యవసాయ అధికారులు జారీ చేస్తున్న కూపన్ల పంపిణీ వద్దకు సోమవారం తెల్లవారుజామునే చేరుకుంది. అప్పటికే చాలామంది రైతులు ఆ రైతువేదికలో కిక్కిరిసి ఉన్నారు. అధికారులు వచ్చి కూపన్లు రాయడం మొదలుపెట్టగానే రైతులందరూ కౌంటర్ల వద్దకు వెళ్లే క్రమంలో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో మహిళా రైతు మల్లమ్మ సొమ్మసిల్లి పక్కనే ఉన్న మరో రైతుపై కుప్పకూలింది. దీంతో స్థానిక రైతులు ఆమెను పక్కకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఎస్సై సంతోశ్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు మధ్య కూపన్లు రాశారు.
ఈ మండలంలోని ఒక్కో పీఏసీఎస్ వద్ద 110 బస్తాల చొప్పున యూరియాను సోమవారం పంపిణీ చేశారు. బారులు తీరిన వారిలో మరో 110 మంది కూపన్లు జారీ చేశారు. వారికి బుధవారం లోడు రాగానే పంపిణీ చేస్తామని ఏవో రాధ తెలిపారు. భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవిపల్లి వద్ద ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డులోని యూరియా పంపిణీ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు కిక్కిరిసిపోయారు. వచ్చిన రైతులకు సరిపడినన్ని యూరియా బస్తాలు లేకపోవడంతో పంపిణీ చేయలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఒక్క బస్తా యూరియా కోసం ప్రతి రోజూ మార్కెట్ యార్డు చుట్టూ తిరగాల్సి వస్తోందని రైతులు ఆక్రందన వ్యక్తం చేశారు.
బోనకల్లు మండలం మోటమర్రి సహకార సంఘం పరిధిలోని రెండు గ్రామాల రైతులకు అందించేందుకు ప్రభుత్వం సోమవారం 230 యూరియా బస్తాలను మాత్రమే పంపింది. కానీ, రైతులు 400 మందికి పైగా చేరుకోవడంతో ఒక్కొక్కరికీ కనీసం ఒక్క కట్ట కూడా రాని పరిస్థితి ఏర్పడింది. ముందుగా వచ్చిన రైతుల నుంచి ఆధార్, పట్టాదారు పాస్బుక్ జిరాక్స్లు తీసుకొని ఇస్తున్నామని ఏఈవో నాగసాయి తెలిపారు. దుమ్ముగూడెం సహకార సంఘంలో తెల్లవారుజామున 4 గంటలకే రైతులు క్యూ కట్టారు. సోమవారం ఈ సొసైటీకి 440 బస్తాలు దిగుమతి కాగా.. రైతులు మాత్రం 900 మందికిపైగా వచ్చారు. సగం మందికే యూరియా అందింది. 15 రోజులుగా తిరుగుతున్నా తమకు అందడం లేదని, అందిన వారికే మళ్లీ మళ్లీ అందుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టేకులపల్లి మండలం బేతంపూడి సొసైటీ వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు చెప్పులను క్యూలో పెట్టి పడిగాపులు కాశారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు సొసైటీకి సోమవారం 220 యూరియా బస్తాలు వచ్చాయంటూ సమాచారం తెలియగానే రైతులు తరలివచ్చారు. అధికారులు కూపన్లు జారీ చేసి రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేశారు. యూరియా అందని వారు నిరాశతో వెనుదిరిగారు. కొత్త వారికి తదుపరి దఫాకు కూపన్లు ఇచ్చామని ఏవో సీతారామిరెడ్డి తెలిపారు. పాల్వంచ సొసైటీకీ రైతులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. వారిలో మహిళా రైతులు, కొందరు బాలింతలు కూడా ఉన్నారు.