కాంగ్రెస్ ప్రభుత్వ ముందస్తు ప్రణాళిక లేకపోవడం, అధికారుల అలసత్వం కారణంగా అన్నదాతలు రెండునెలలుగా గోస పడుతూనే ఉన్నారు. పంటలకు వేసేందుకు యూరియా కోసం నానాయాతన పడుతున్నారు. సహకార సొసైటీ కార్యాలయాలు, గోడౌన్ వద్ద తెల్లవారుజాము నుంచే పడిగాపులు కాస్తున్నారు. జోరువర్షంలోనూ తడుస్తూ అక్కడే వేచిఉంటున్నారు. ఒక్క బస్తా అయినా దొరక్కపోతుందా అని తిండీనీళ్లు మానుకొని మరీ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వేసిన పత్తి, ఇతర పంటలతోపాటు గత వారంరోజులుగా జోరుగా వర్షాలు కురుస్తుండడంతో వరినాట్లు సైతం పూర్తి కావొస్తున్నాయి.
దీంతో యూరియా అవసరం పెరగడంతో రైతన్నలు విలవిలలాడుతున్నారు. ఇంతా జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చీమకుట్టినట్లు కూడా స్పందించడం లేదు. రైతులకు సరిపడా యూరియాను అందించడంలో పూర్తిగా విఫలమైంది. సోమవారం తల్లాడలో పోలీసు బందోబస్తు మధ్య ఎరువులు పంపిణీ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. గత కేసీఆర్ పాలన పదేండ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదని, సంతోషంగా వ్యవసాయం చేసుకున్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంకనే ఈ దుస్థితి దాపురించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బూర్గంపహాడ్, ఆగస్టు 18 : బూర్గంపహాడ్ మండలంలోని మోరంపల్లిబంజర సహకార సంఘం గోడౌన్ వద్ద సోమవారం యూరియా బస్తాల కోసం రైతులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. ఒక్కో రైతుకు ఎకరానికి రెండు కట్టలు చొప్పున ఇవ్వాల్సిన అధికారులు అరకొరగా ఇవ్వడంతో నిరాశతో వెనుదిరిగారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా జోరు వర్షం కురుస్తున్నా రైతులు తడుస్తూనే యూరియా కోసం వేచి ఉన్నారు. ఒకపక్క ప్రభుత్వం యూరియా కొరతలేదని చెబుతూనే రైతులను ఇబ్బందులకు గురిచేస్తుండడంతో రైతులు మండిపడుతున్నారు.
మూడు ఎకరాల్లో వరిసాగు చేశాను. యూరియా బస్తాల కోసం మూడు రోజులుగా గోడౌన్, కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. సోమవారం గోడౌన్ వద్ద యూరియా స్టాక్ తక్కువగా ఉందని రెండు బస్తాలు మాత్రమే ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత పదేళ్లలో లేని యూరియా సమస్య కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఎలా వచ్చింది.
-బండారి సోమయ్య, రైతు, మోరంపల్లి బంజర, బూర్గంపహాడ్ మండలం
తల్లాడ, ఆగస్టు 18: తల్లాడలోని సొసైటీ కార్యాలయానికి యూరియా స్టాక్ చేరుకోవడంతో విషయం తెలుసుకున్న రైతులు సోమవారం పెద్దఎత్తున అక్కడకు చేరుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే సొసైటీ వద్ద వేచి ఉన్నారు. 900 బస్తాలు మాత్రమే స్టాక్ రావడంతో ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున అందించేందుకు అధికారులు కూపన్లు ఇచ్చారు. పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు ఉన్నవారికి ఒక బస్తా మాత్రమే అందించారు. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
4గంటల నుంచి వేచిఉన్నా ఒక బస్తా లెక్క ఇవ్వడంపై మండిపడ్డారు. ఒక బస్తా యూరియా కోసం రోజంతా వేచిఉండాల్సిన దుస్థితిపై మనోవేదనకు గురయ్యారు. కొంతమంది రైతులు కూపన్లు అందకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుతిరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మార్పు ఇదేనా అని కొందరు రైతులు కేకలు చేశారు. కేసీఆర్ పాలనలో యూరియా కోసం ఈ పడిగాపులు లేవన్నారు. వ్యవసాయ అధికారులు కలగజేసుకొని పోలీసుల బందోబస్తు మధ్య కూపన్లు రూపంలో బస్తాలు అందించారు.
యూరియా కట్టలు రైతులకు సకాలంలో అందించాలి. ప్రభుత్వం రైతులను ఇబ్బందులు పెట్టడం సరికాదు. తెల్లవారుజాము నుంచి వేచి ఉంటే ఒక బస్తా యూరియా అందించడం రైతుల్లో నిరాశను కలిగిస్తున్నది. యూరియా కోసం పనులను వదిలేసి సొసైటీ కార్యాలయం ఎదుట పడిగాపులు కాయాల్సి వస్తున్నది.
– ఆపతి వెంకటరామారావు, రైతు, తల్లాడ