కారేపల్లి, సెప్టెంబర్ 26 : యూరియా కోసం ఎన్నడూ లేని విధంగా రైతులు అవస్ధలు పడుతున్నారని, దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమని తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేశ్, బంతు రాంబాబు అన్నారు. తెలంగాణ రైతు సంఘం సింగరేణి మండల మహాసభ శుక్రవారం భాగం రామనర్సయ్య భవన్లో ముండ్ల ఏకాంబరం అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు హాజరైన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం యూరియా సబ్సీడీ తగ్గించుకునే ఎత్తుగడలో భాగమే యూరియా కొరత అన్నారు. వ్యవసాయ రంగానికి సబ్సీడీలు తగ్గిస్తూ కార్పొరేట్ మిత్రులకు రాయితీలు ఇస్తుందని విమర్శించారు. దేశంలో 52 శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతాంగాన్ని సబ్సీడీలు ఎత్తివేస్తున్న మోదీ, 1 శాతం ఉన్న తన కార్పొరేట్ మిత్రులకు రూ.16 లక్షల కోట్లు సబ్సిడీ ఇచ్చిందన్నారు. రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రధాని మోదీ రైతు వ్యతిరేక చట్టాలైన మూడు రైతు చట్టాలను దొడ్డిదారిన అమలుకు ప్రయత్నిస్తున్నారని, దానిలో భాగంగా విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంట్ సెలక్షన్ కమిటీకి పంపినట్లు తెలిపారు.
విద్యుత్ సవరణ చట్టంతో ప్రీపెయిడ్ మీటర్లు పెట్టి, నగదు బదిలీ పేరుతో విడుతల వారిగా సబ్సీడీలు ఎత్తివేస్తారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు బడ్డెట్ను గ్రీన్ చానల్ ద్వారా రప్పించి చిత్తశుద్దితో పూర్తి చేయాలన్నారు. ఫారెస్ట్ క్లియరెన్స్ త్వరతగతిన వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ రైతు డిక్లరేషన్ అమలును విస్మరించిందన్నారు. రూ.31 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా రూ.16 వేల కోట్లు చేసి మాఫీ పూర్తి అయిందని ప్రకటించటం సిగ్గుచేటన్నారు. 40 శాతం రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. రెండు విడుదల రైతు భరోసాను ఎగవేసిన ఘనత సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వానిదేనన్నారు. యాసంగి బోనస్ ఇంతవరకు జాడలేదని, పంట పరిహారం అరకొరగా ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తుందని విమర్శించారు. రైతాంగ సమస్యలపై రైతు సంఘం రైతులను సమీకరించి పోరాటం చేయనున్నట్లు పేర్కొన్నారు.
సింగరేణి మండలం తెలంగాణ రైతు సంఘం నూతన కమిటీని మహాసభలో ఎన్నుకున్నారు. రైతు సంఘం మండల అధ్యక్షుడిగా ముండ్ల ఏకాంబరం, కార్యదర్శిగా వజ్జా రామారావును ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు దుగ్గి కృష్ణ, సహాయ కార్యదర్శి చింతనిప్పుల చలపతిరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొండబోయిన నాగేశ్వరరావు, బానోత్ బన్సీలాల్, సీఐటీయూ మండల కన్వీనర్ కె.నరేంద్ర, ఐద్వా మండల అధ్యక్ష, కార్యదర్శులు సురబాక ధనమ్మ, కొండబోయిన ఉమావతి, మండల నాయకులు కొత్తూరి రామారావు, తలారి దేవప్రకాశ్, కరపటి సీతారాములు, పాపినేని నాగేశ్వరరావు, వల్లభినేని మురళి, బోజడ్ల గోవిందరావు, భాగం వెంకట అప్పారావు, ఎస్కె.సైదులు, రాయల మాధవ్ రావు, కల్తి రామచంద్రయ్య, బత్తుల శ్రీనివాసరావు పాల్గొన్నారు.