భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్రం కోసం వీరమరణం పొందిన అమరుల త్యాగాన్ని అందరమూ గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశానికి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించేందుకు అమరులు చేసిన త్యాగం అజరామరమని గుర్తుచేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పంట పొలాలను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పెండింగ్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని భద్రాచలంలో గోదావరి వరదలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కరకట్ట ఆధునీకరణ పనులు చేస్తున్నామని అన్నారు. కొత్తగూడెం ప్రగతి మైదాన్‌లో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆ మైదానంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు.
అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. కొత్తగూడెం నుంచి కిరండోల్ రైల్వే కనెక్టవిటీతో భద్రాచలానికి త్వరలో రైలుమార్గాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు చెప్పారు. దీంతో టూరిజం మరింత అభివృద్ధి చెందనుందన్నారు. కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, అది కూడా ఫలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోనే తొలిసారిగా కొత్తగూడెం ఎర్త్ సైన్సెన్ యూనివర్సిటీని ఏర్పాటుచేయబోతున్నామన్నారు.
అశ్వారావుపేటలో కొబ్బరి పరిశోధనా కేంద్రాన్ని, కొత్తగూడెంలో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీని ఏర్పాటుచేయాలని కోరుతూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి ప్రతిపాదనలు చేశామన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం, ఉత్తమ అధికారులు, ఉద్యోగులకు మంత్రి ప్రసంసాపత్రాలు అందజేశారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజు, ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ, డీఎఫ్‌వో కృష్టగౌడ్, ఎమ్మెల్యే కూనంనేని సాంభశివరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, భద్రాద్రి కలెక్టరేట్లో కలెక్టర్ జితేశ్ వి పాటిల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.