కారేపల్లి, మార్చి 20 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో విద్యారంగాన్ని విస్మరించడం జరిగిందని పీడీఎస్యూ జిల్లా నాయకుడు స్టాలిన్ అన్నారు. విద్యా రంగానికి నామమాత్రపు నిధుల కేటాయింపును నిరసిస్తూ గురువారం కారేపల్లి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడ్జెట్లో 30 శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా విద్యారంగానికి కనీసం 15 శాతం నిధులు కూడా ఇవ్వకపోవడం బాధాకరమన్నారు.
జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ఉండి కూడా జిల్లాలో ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఏర్పాటుపై అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయకపోవడం సిగ్గుచేటన్నారు. తక్షణమే బడ్జెట్ ప్రతిపాదనకు సవరణ చేసి ప్రొఫెసర్ కొఠారి కమిషన్ ప్రతిపాదించిన విధంగా రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం నిధులను కేటాయించాలన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటుకు స్థానిక మంత్రులు స్పందించాలని, లేకపోతే విద్యార్థుల నిరసనలకు గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు రాము, మహేశ్, వంశీకృష్ణ, రాజు, రాకేశ్, సురేశ్, రాజేందర్ పాల్గొన్నారు.