రఘునాథపాలెం, మార్చి 16: ‘ఖమ్మం భూదాన్ భూముల్లో సర్వస్వం కోల్పోయిన తమకు అక్కడే ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆదుకోండి సార్’ అంటూ వెలుగుమట్ల బాధితులు సోమవారం కలెక్టరేట్లో అధికారులను వేడుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెలుగుమట్లలో ఇండ్లు కూల్చేసిన వారిలో కొద్దిమందికే ఇటీవల పట్టాలు పంపిణీ చేశారని, అర్హులైన తమకు ఇండ్ల పట్టాలు ఇవ్వలేదని చెప్పారు.
కలెక్టరేట్లో బాధితులు అధిక సంఖ్యలో ఉండటంతో అధికారులు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటుచేసి, వినతి పత్రాలు సేకరించారు. డీఆర్వో బాధితులతో మాట్లాడుతూ.. విచారణ చేపట్టి అర్హులకు న్యాయం చేస్తామని చెప్పారు. బాధితులు మాట్లాడుతూ.. పట్టాలిచ్చి, ఇందిరమ్మ ఇండ్లు కట్టించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.