హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించిన జూన్ నెల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు టీటీడీ తెలిపింది. ఈ సేవ టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20న ఉదయం 10 గంటలవరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నది. 20 నుంచి 22 వరకు మధ్యాహ్నం 12 గంటలలోపు నగదు చెల్లించిన వారికి మంజూరవుతాయని వెల్లడించింది. కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార, జేష్ఠాభిషేకం టికెట్లను 21న ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు పేర్కొన్నది.
23న అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటా, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్టు వెల్లడించింది. ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను 24న ఉదయం 10 గంటలకు, గదుల కోటా మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేస్తామని వివరించింది. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.