వచ్చే ఎన్నికల్లో భద్రాద్రి జిల్లాలో గులాబీ జెండా ఎగురవేయాలని, అదే లక్ష్యంతో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆయనకు శనివారం జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలతో సన్మానించారు. ముందుగా, జూలూరు పాడు నుంచి ర్యాలీగా కొత్తగూడెం తీసుకొచ్చారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఐదు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ను గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి గడ్డపై గులాబీ జెండా ఎగరాలని, అదే లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడి హోదాలో హైదరాబాద్ నుంచి తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆయనకు.. జూలూరుపాడులోని జిల్లా సరిహద్దు వద్ద, కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. విద్యానగర్ కాలనీలో నాయకులు, కార్యకర్తలు ఆయనకు గజమాలతో స్వాగతం పలికారు. రేలా నృత్యాలు, డప్పు చప్పుళ్లతో జూలూరుపాడు నుంచి కొత్తగూడెం వరకు భారీ ర్యాలీగా వచ్చారు. కొత్తగూడెం క్లబ్లో నిర్వహించిన స్వాగత, సన్మాన సభకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించి సన్మానం చేశారు.
ఈ సభలో రేగా కాంతారావు మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం.. ఉద్యమ జిల్లా అని, ఇలాంటి జిల్లాలో పనిచేయడం ఒక సవాల్ అని అన్నారు. సత్తా ఉంటేనే ఇక్కడ అందరితో కలిసి పనిచేయడం సాధ్యమవుతుందన్నారు. అలాంటి నాయకత్వాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తనకు పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారని గుర్తుచేశారు. ముందుగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. రానున్న రోజుల్లో అందరమూ కలిసి కారులో ప్రయాణం చేయాల్సి ఉంటుందని, అనుకున్న మాట ప్రకారం జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ జెండాను ఎగురవేయడం ఖాయమని అన్నారు. మనందరిదీ ఒకే బాట, ఒకే మాట అని.. అదే సీఎం కేసీఆర్ మాట అని అన్నారు. వచ్చే ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకుని పనిచేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఉద్యమకారులకు పెద్దపీట వేస్తామన్నారు.
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి చేపట్టాక తొలిసారిగా జిల్లాకు వచ్చిన రేగా కాంతారావును జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు వచ్చి సన్మానించారు. ఉద్యమనాయకులు గజమాలతో సత్కరించారు. జిల్లా కేంద్రమంతా రేగా కాంతారావు ఫ్లెక్సీలతో గులాబీమయమైంది.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యువనాయత్వానికి పార్టీ పగ్గాలు ఇచ్చారని, ఆయనకు ఇచ్చినమాట నిలబెడతామని టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు అన్నారు. ఉమ్మడి జిల్లాలో జోడు గుర్రాలుగా పనిచేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. రెండు జిల్లాలో పదికి పది స్థానాలు గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇస్తామన్నారు. మంత్రి పువ్వాడ, ఎంపీలు నామా, కవిత, జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యేల సహకారంతో ముందుకు సాగుతామన్నారు. కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేసి సత్తా చాటుతామన్నారు.
పార్టీ అధినేత కేసీఆర్ యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇచ్చారని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య అన్నారు. రేగా నాయకత్వంలో అందరమూ కలిసి పనిచేస్తామని, రెండు జిల్లాల్లో గులాబీ జెండాలను ఎగురవేస్తామని అన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ చైర్మన్లు కాపు సీతాలక్ష్మి, డీ.వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి తెల్లం వెంకట్రావు, ఊకంటి గోపాల్‌రావు, హరిసింగ్, రాంబాబు, అనుదీప్, మోరె భాస్కర్, కొత్వాల శ్రీనివాస్, ఎంపీపీలు, జడ్పీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన తరువాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు జిల్లా సరిహద్దు గ్రామమైన వినోబానగర్ వద్ద శనివారం ఘన స్వాగతం లభించింది. వైరా ఎమ్మెల్యే రాములునాయక్, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. వందల సంఖ్యలో కార్లతో కాన్వాయిగా వచ్చిన రేగాకు మహిళలు బొట్టుపెట్టి హారతులిచ్చారు. గిరిజన మహిళలు బిందెలు, నృత్యాలతో స్వాగతం పలికారు. ఆయన వారితో కలిసి స్టెప్పులేసి ఉత్సాహపరిచారు. వందలాది మంది కార్యకర్తల హర్షద్వానాల మధ్య జూలూరుపాడు మీదుగా ర్యాలీగా కొత్తగూడెం చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పినపాక, భద్రాచలం, కొత్తగూడెం నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. లేళ్ల వెంకటరెడ్డి, సోని, కళావతి, నర్సింహారావు, వీరభద్రం, సతీశ్‌కుమార్, మధుసూదన్‌రావు, రాజశేఖర్, సత్యనారాయణ, నర్సింహారావు, సురేశ్, నాగయ్య, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు పాల్గొన్నారు.