ఖమ్మం అర్బన్, మే 30 : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించేందుకే ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు డీఈవో సామినేని సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ మేనేజ్మెంట్ల కింద పనిచేసే 5 వేల మంది ఉపాధ్యాయులకు జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో 15 రోజులపాటు మూడు విడతలుగా నిర్వహించిన శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి.
రోటరీనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, హార్వెస్ట్, న్యూఇరా, న్యూవిజన్ పాఠశాలల్లో నిర్వహించిన శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో డీఈవో పాల్గొని ప్రసంగించారు. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆశిస్తున్నట్లుగా వారి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు శిక్షణలు తోడ్పడాలన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలల్లో అమలు చేసే విధంగా ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలన్నారు.
కాగా.. జిల్లా కేంద్రంలోని నాలుగు సెంటర్లలో స్కూల్ అసిస్టెంట్లు, ఉన్నత పాఠశాలల హెచ్ఎంలకు శిక్షణ ఇచ్చారు. అన్ని మండల కేంద్రాల్లో ఎస్జీటీ, ఎల్ఎఫ్ఎల్ ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి చేశారు. ప్రధానంగా బోధనా పద్ధతులు, టెక్నాలజీ వినియోగం, జీవన నైపుణ్యాలు, ఇతర అంశాలపై నిర్వహించిన శిక్షణా తరగతులు విజయవంతమైనట్లు డీఈవో సత్యనారాయణ, జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ కేశవపట్నం రవికుమార్ తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో డీసీపీవో విష్ణువందన, సెంటర్ ఇన్చార్జిలు పాల్గొన్నారు.