ఇది ఉద్యోగనామ సంవత్సరం.. అవును.. యువతకు ఉగాదికి ముందే పండుగ వచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొలువుల ‘కుంభమేళా’కు తెరలేచింది. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యోగ సైరన్ మోగింది. కలల తీరంలో ఉద్యోగాల సాధనకు కుస్తీ మొదలైంది. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ నిరుద్యోగులు, యువతకు తీపి కబురు అందించారు. రాష్ట్రంలో ఒకేసారి 91,142 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో 80,039 నియామకాలు చేపడతామని, మిగిలిన వాటిలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పడంతో సర్వతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడనున్నది. దీంతో యువత ప్రభుత్వ ఉద్యోగాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎలాగైనా సర్కారు కొలువు సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నది. ప్రణాళిక రూపొందించుకొని ఆ దిశగా అడుగేస్తున్నది. ఇప్పటికే కొందరు హైదరాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం వంటి పట్టణాల్లోని శిక్షణ కేంద్రాల్లో చేరేందుకు సమాయత్తం అవుతున్నారు. మరికొందరు పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే, స్థానికతకు పెద్దపీట వేయడం.. వయో పరిమితి పెంచడంతో ఈ సారి ఉద్యోగాలకు తీవ్ర పోటీ నెలకొననున్నది.
– ఖమ్మం, మార్చి10( నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రకటన రానే వచ్చింది.. సీఎం కేసీఆర్ బుధవారం అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన చేశారు.. పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి జిల్లాకు చెందిన నిరుద్యోగుల్లో నూతనోత్సాహం నిండింది. త్వరలో వచ్చే వేలాది పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల కానుండడంతో పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్రాలతో పాటు ఇతర పట్టణాల్లోని కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు.
నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు ఉద్యోగాల ప్రకటన వస్తుందా.. అని ఎదురుచూస్తున్నారు. తమ సామర్థ్యాలను పరీక్షించుకుని ప్రభుత్వ కొలువు సాధించాలనుకుంటున్నారు. ఈ సందర్భంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలపై కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 80వేలకు పైగా కొలువలును భర్తీ చేస్తామని నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. దీంతో వారిలో కొత్త ఆశలు చిగురించాయి. నిన్న మొన్నటి వరకు నోటిఫికేషన్ వస్తుందో.. రాదో.. అని సందిగ్ధంలో ఉన్న అభ్యర్థులు ఇప్పుడు రాత్రింబవళ్లు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఈసారి 40 వేల మందికి పైగా అభ్యర్థులు పోటీ పరీక్షలు రాసే అవకాశం ఉందని ఓ అంచనా. ఇప్పటికే ఎంతో మంది పరీక్షలకు సిద్ధమవుతుండగా ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నవారు అవసరమైతే ఉద్యోగం వదిలేసి, లేదా లీవ్ పెట్టి మరీ చదువడానికి సిద్ధమవుతున్నారు.
కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌ల కారణంగా రెండేళ్లుగా కోచింగ్ సెంటర్లు మూతపడ్డాయి. ప్రస్తుతం కరోనా కేసులు లేకపోవడంతో మూతపడిన కోచింగ్ సెంటర్లన్నీ తిరిగి పునఃప్రారంభమయ్యాయి. తాజాగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై చేసిన ప్రకటనతో కోచింగ్ సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. ఖమ్మం నగరంలో ఇప్పటికే పోటీ పరీక్షలకు నాణ్యమైన కోచింగ్ ఇచ్చే శిక్షణ సంస్థలున్నాయి. జిల్లావ్యాప్తంగా మరో 10కి పైగా కోచింగ్ సెంటర్లు నడుస్తున్నాయి. అభ్యర్థులు ఉత్తమ ఫ్యాకల్టీ, డైలీ టెస్ట్‌ల నిర్వహణ, ప్రామాణిక స్టడీ మెటీరియల్ ఇస్తున్న సంస్థలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కొందరు ఎక్కువ ఫీజు చెల్లించి మరీ నాణ్యమైన కోచింగ్ సెంటర్లలోనే చేరుతున్నారు.
పరీక్షల నిర్వహణకు సుమారు నాలుగైదు నెలల వ్యవధి పట్టే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు సిలబస్‌కు అనుగుణంగా చదివితే విజయం సాధ్యమే అంటున్నారు నిపుణులు. దిన పత్రికలు చదువుతూ, కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే ఉద్యోగం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. అభ్యర్థులు ప్రామాణిక పుస్తకాలను అధ్యయనం చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. వయోపరిమితి పెంచిన నేపథ్యంలో ఈసారి లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశం ఉంది. సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుని చదివితే రివిజన్ సులభంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. రోజు నమూనా పరీక్షలు రాస్తే తమకు తాము అంచనా వేసుకునేందుకు అవకాశం ఉంటుందంటున్నారు.
గతంలో అభ్యర్థులు టీచర్, పోలీస్, గ్రూప్స్ ఉద్యోగాలకు నాణ్యమైన శిక్షణ తీసుకోవడానికి హైదరాబాద్ వెళ్లేవారు. ప్రస్తుతం ఖమ్మంలోనే ఉత్తమ కోచింగ్ సెంటర్లు వెలిశాయి. దీంతో అభ్యర్థులు స్థానికంగా ఉండే శిక్షణ తీసుకుంటున్నారు. నగరంలోని కోచింగ్ సంస్థలు రాష్ట్రస్థాయిలో పేరున్న ఫ్యాకల్టీని తీసుకువస్తున్నాయి. విద్యార్థులకు ప్రతిరోజు మాక్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. ప్రామాణిక స్టడీ మెటీరియల్ అందిస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో ఇప్పటికే ర్యాంక్‌లు సాధించాయి. నగరంలోని ఓ ప్రముఖ సంస్థ గడిచిన నాలుగేళ్లలో 1,200 మందికి పైగా విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా చేసింది.
ఒకేసారి ఇంత భారీ మొత్తంలో ఉద్యోగ ప్రకటన చేయడం అభినందనీయం. సీఎం కేసీఆర్ మాట ఇస్తే ఆరునూరైనా నెరవేర్చితీరుతారు. యావత్ తెలంగాణ యువత, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చెప్పడంతో మాలో కొత్త ఆశలు చిగురించాయి. నాకు పోలీసు కావాలనే కోరిక ఉంది. తెలంగాణ ప్రభుత్వం18వేలకుపైగా పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించడం సంతోషంగా ఉంది. ఖమ్మంలో పోలీస్ ఉద్యోగానికి కోచింగ్ తీసుకుంటున్నా. ఎలాగైనా పోలీస్ ఉద్యోగం సాధిస్తా.
-సౌందర్య, నేలకొండపల్లి మండలం, తిరుమలాపురం గ్రామం
చిన్నప్పటి నుంచి నాకు ప్రభుత్వ ఉద్యోగి కావాలని కోరిక. డిగ్రీ పూర్తి చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్- 2, 3, 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ప్రకటించనున్న నేపథ్యంలో ఎలాగైనా నా కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నా. ప్రణాళికబద్ధంగా చదువుతున్నా. భారీగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నందున నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం.
– గాయత్రి, విద్యార్థిని, ఖమ్మం
నేను ఆరు నెలలుగా ఖమ్మంలోని ఓ శిక్షణ సంస్థలో గ్రూప్-2 కోచింగ్ తీసుకుంటున్నా. ప్రభుత్వ ఉద్యోగాలపై తాజా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనతో మరింత ధైర్యం వచ్చింది. ప్రతిరోజు 12 గంటలకు పైగా చదువుతున్నా. ఈసారి ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చదువుతున్నా. ప్రస్తుతం 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కే విధంగా జోన్స్ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– ఉమా మహేశ్వరి, విద్యార్థిని, ఖమ్మం