నమస్తే నెట్వర్క్, సెప్టెంబర్ 1 : ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో సోమవారం వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, కుంటలు మత్తడులు పోస్తున్నాయి. వరిపొలాలు చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అన్నపురెడ్డిపల్లి మండలంలో అబ్బుగూడం- కట్టుగూడం వాగు, రాళ్లచెరువు అలుగు రోడ్డుపై ప్రవహించడంతో రాకపోకలను నిలిపివేశారు.
అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి సమీపంలోని నల్లబాడు వాగు ఉధృతంగా ప్రవహించడంతో అశ్వారావుపేట నుంచి వాగొడ్డుగూడెం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. అశ్వారావుపేట మండలంలో అచ్యుతాపురం సాకారం చెరువు కాలువ రామచంద్రాపురం వద్ద చప్టాపై నుంచి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నారంవారిగూడెంకాలనీ సమీపంలో గుర్రాలచెరువు హైలెవల్ వంతెన వద్ద కాలువ ప్రమాదకరంగా ప్రవహిస్తున్నది. చర్ల మండలంలో చేపలవేటకు వెళ్లిన రాళ్ళగూడెం(పర్ణశాల) గ్రామానికి చెందిన వ్యక్తి సమీపంలోని ఊటఒర్రెవాగు దాటుతూ ప్రమాదవశాత్తు నీటమునిగి మృతిచెందాడు. తహసీల్దార్ శ్రీనివాసరావు, సీఐ రాజువర్మ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.
చండ్రుగొండ మండలం పోకలగూడెం- బాలియంతండా గ్రామాల మధ్య వాగు చప్టాపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. రామవరం ఎస్‌సీబీనగర్ మొత్తం నీట మునిగింది. ఇళ్లలోకి మోకాళ్లలోతు నీరు చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులుపడ్డారు. టేకులపల్లి మండలంలో ముర్రేడువాగు, రాళ్ళవాగు, పెద్దవాగు, పుణ్యపువాగు, కరిశాలవాగు, తెల్లవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో మద్రాస్‌తండా, కొండగులబోడు, బేతంపూడి, వెంకట్యాతండా, రోళ్ళపాడు, తూర్పుగూడెం, రాంపురం గ్రామాల వద్ద రాకపోకలు నిలిచిపోయాయి.
లక్ష్మీదేవిపల్లిలోని మొర్రేడువాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. శ్రీనగర్‌కాలనీ, ఇందిరానగర్‌కాలనీ, ప్రశాంత్‌నగర్ కాలనీల్లో భారీగా వరద నీరు నిలిచింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాపటపల్లి-వీఆర్ బంజర గ్రామాల మధ్య బుగ్గవాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొణిజర్ల మండలం తీగలబంజర సమీపంలోని పగిడేరు వాగు, అంజనాపురం సమీపంలోని నిమ్మవాగు పొంగి పొర్లాయి. దీంతో పల్లిపాడు నుంచి ఏన్కూరు వెళ్లే వాహన రాకపోకలు నిలిచిపోగా సుమారు 15 గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి.
కారేపల్లి మండలం చీమలపాడు రహదారిపై వాగు పొంగడం, తోడిదలగూడెం వద్ద లలితాపురం పెద్దచెరువు అలుగు పోస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కిన్నెరసాని ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో డ్యామ్ సైట్ అధికారులు సోమవారం మూడు గేట్ల ద్వారా 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఉదయం ప్రాజెక్టులో కేవలం 2,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో మాత్రమే ఉంది. అప్పుడు నీటిమట్టం 405 అడుగులు ఉండగా.. తర్వాత భారీగా వరద నీరు చేరడంతో సాయంత్రం వరకు ఇన్‌ఫ్లో 10,600 క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా.. వరద నీరు చేరడంతో నీటిమట్టం 405.50 అడుగులకు చేరింది.
భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం నెమ్మదిగా తగ్గుతోంది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద కూడా తగ్గుతూ సోమవారం ఉదయం 6 గంటలకు 47.9 అడుగులున్న గోదావరి ప్రవాహం సాయంత్రం 4 గంటలకు 44.50 అడుగుల వద్దకు చేరుకుంది. రాత్రి 7:37 గంటలకు అధికారులు మొదటి ప్రమాద హెచ్చకను ఉపసంహరించారు. చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువప్రాంతం నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటలకు 11 గేట్లు మూడు అడుగుల మేర ఎత్తి 20.758 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.