మిర్చి పంట రైతుల కంట కన్నీరు పెట్టిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక రైతన్న దిగాలు చెందుతున్నాడు. రైతులు కష్టకాలంలో ఉంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులంతా సిండికేట్ అయ్యి మిర్చి రైతుల కంట్లో కారం కొడుతుంటే అధికారులు, పాలకవర్గం చోద్యం చూస్తోంది. వ్యాపారులు జెండాపాటకు హాజరుకాకుండా రైతులకు సరైన గిట్టుబాటు దక్కకుండా నిలువునా మోసం చేస్తున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గతేడాది రూ.23 వేలు పలికిన క్వింటా మిర్చి ధర.. ప్రస్తుతం రూ.14 వేలకే పరిమితమైంది. గిట్టుబాటు ధర లభించకపోవడంతో రూ.లక్షలు పెట్టి సాగు చేసిన అన్నదాతలు లబోదిబోమంటున్నారు. గిట్టుబాటు ధర కల్పించండి సారూ.. అని నెత్తీనోరు మొత్తుకుంటున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
-ఖమ్మం, మార్చి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. మార్కెట్లో తిష్ట వేసుకొని కూర్చున్న వ్యాపారుల చేతిలో నిలువునా మోసపోతున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సిండికేట్ వ్యవహారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా ఫరిడవిల్లుతుండడంతో అన్నదాతలు ఆరుగాలం శ్రమించినా ఫలితం శూన్యమంటూ బోరున విలపిస్తున్నారు. ఈ ఏడాది ఎకరాకు కౌలు మొదలుకొని పురుగు మందులు, కూలీలు కలుపుకొని రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెడుతున్నారు.
కానీ.. ఈ ఏడాది తామర తెగుళ్ల కారణంగా ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. తీరా చేతికొచ్చిన కొద్ది పంటనూ అమ్ముకునేందుకు మార్కెట్‌కు తీసుకొస్తే ధర తక్కువగా ఉండడంతో రైతులు అయోమయంలో ఉన్నారు. మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు మొదలైనప్పటి నుంచి గిట్టుబాటు ధర కోసం మొత్తుకుంటున్నా.. అధికారులు, పాలకవర్గ బాధ్యులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు నిత్యం 70-80 వేల బస్తాల మిర్చి వస్తుంటుంది. ఖమ్మం, వరంగల్‌తోపాటు తెలంగాణకు సరిహద్దుగా ఉన్న ఆంధ్రా ప్రాంతం నుంచి సైతం మార్కెట్‌కు పెద్దఎత్తున మిర్చి తరలివస్తున్నది. దీంతో గత సోమవారం ఒక్కరోజే లక్షా 20 వేల మిర్చి బస్తాలు ఖమ్మం మార్కెట్‌కు వచ్చాయి.
అత్యధికంగా మార్కెట్‌కు మిర్చి వస్తుందనే సాకుతో వ్యాపారులు క్వింటా మిర్చి ధరను రూ.14 వేలకే పరిమితం చేశారు. జెండాపాటకు వచ్చి మిర్చి ధరను పెంచాల్సిన వ్యాపారులు కేవలం అరకొరగా హాజరై రైతులకు గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నారు. కనీసం రూ.25 వేలు మద్దతు ధర ఇస్తేనే గిట్టుబాటు కలుగుతుందని అన్నదాతలు వాపోతున్నారు. ఇదిలా ఉంటే.. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో జెండా పాట రూ.14 వేలు పైచిలుకు పలుకుతుండగా.. వ్యాపారులు మాత్రం ఐదువందల పైచిలుకు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు.
తేమ శాతం, నాణ్యత పేరుతో రూ.1000 నుంచి రూ.2 వేలు తగ్గించి కొంటున్నారు. ఇదేంటని ప్రశ్నించిన రైతులకు కనీసం సరైన సమాధానం చెప్పకుండానే వ్యాపారులు వెనుదిరుగుతున్నారు. గతేడాది కంటే ఈ ఏడు మార్కెట్లో మిర్చి ధరలు సగానికి సగం తగ్గిపోవడంతో దిక్కుతోచని స్థితిలో అన్నదాత కొట్టుమిట్టాడుతున్నాడు. ఎకరానికి రూ.90 వేల నుంచి రూ.లక్ష వరకు నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చి పంటను క్వింటాకు రూ.25 వేల చొప్పున కొనుగోలు చేయాలని వేడుకుంటున్నారు.