మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్కెటింగ్ శాఖ అనేక నూతన పద్ధతులను అమల్లోకి తీసుకొస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అవి అమలుకావడం లేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్నదాతలకు అందుబాటులోకి తీసుకొస్తే వారు మరింత ప్రయోజనం పొందే అవకాశం ఉందన్న ఉన్నతాధికారుల ఆలోచనలు అంతర్థానమైపోతున్నాయి. తద్వారా వ్యవసాయ మార్కెట్‌కు పంటను తీసుకొచ్చిన రైతులు.. వ్యాపారుల దయాదాక్షిణ్యాల మీదనే ఆధారపడాల్సి వస్తున్నది. అందుబాటులో ఉన్న అవకాశాలన్నింటినీ ఖరీదుదారులు సొమ్ము చేసుకుంటున్నారు.
ఎండకు ఎండి వానకు తడిచి పంట పండించిన రైతులు మాత్రం నయవంచనకు గురవుతున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఇలాంటి మోసాలు సర్వసాధారణమయ్యాయి. యంత్రాలను వినియోగించి పత్తి తేమ శాతాన్ని నిర్ధారించాల్సిన చోట కూడా అది అమలు కావడం లేదు. ఖరీదుదారులందరూ రైతులు తెచ్చిన పత్తిని చేతితో పట్టుకొని చూసి తేమ శాతాన్ని అంచనా వేస్తున్నారు. నోటికి వచ్చిన ధరను చెబుతున్నారు. అదే ఫైనల్ ధర అంటూ ఖరారు చేస్తున్నారు. పత్తి రైతులను నోరు మెదపనీయకుండా చేసి వారి నెత్తిన పెద్ద కుచ్చుటోపీ పెడుతున్నారు. ఇటీవలి ఖమ్మం కలెక్టర్ ఏఎంసీ పర్యటనలో ఈ దోపిడీ అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది.
ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 13: రాష్టంలోని అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఖమ్మం ఏఎంసీ ఒకటి. రైతులు, వ్యాపారులు, కార్మికుల సౌకర్యార్థం గత కేసీఆర్ ప్రభుత్వం ఈ మార్కెట్లోని అన్ని విభాగాల్లోనూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సీసీ టీవీలు, జీపీఆర్ఎస్ కాంటాలు, ఈ-నామ్, ఈ-టామ్ వంటి విధానాలను అమల్లోకి తెచ్చింది. అన్ని పంటల్లో తేమ శాతాన్ని నిర్ధారించేందుకు తేమ శాతం నిర్ధారణ యంత్రాలను కూడా అందుబాటులో ఉంచింది. వీటి ద్వారా పంటలను కొనుగోలు చేసి నాణ్యతా ప్రమాణాల ప్రకారం రైతులకు మద్దతు ధర చెల్లించాల్సిన వ్యాపారులు.. ఇటీవల కాలంగా తమ ధరలను చెబుతూ రైతులను నిలువునా ముంచుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితిలో ఖరీదుదారులు చెప్పిన ధరకే అన్నదాతలు తమ రెక్కల కష్టాన్ని విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
ఇటీవల ఖమ్మం ఏఎంసీలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పర్యటించిన సందర్భంగా తేమ శాతం పరీక్షల విషయంలో చేదు నిజాలు బహిర్గతమయ్యాయి. పత్తి యార్డులో కలియతిరిగిన కలెక్టర్‌కు అనుమానం కలిగింది. దీంతో పంట లాట్ల వద్ద సిబ్బందితో తేమ శాతం పరీక్షలను చేయించారు. ఈ సందర్భంగా ఓ రైతు పంటలో కేవలం 9 శాతమే తేమ ఉన్నట్లు యంత్రంలో నమోదైంది. దీంతో సదరు రైతుతో కలెక్టర్ మాట్లాడారు. ‘ఈ పంటకు వ్యాపారులు ఎంత ధర పెట్టారు?’అని అడిగారు. ‘క్వింటాకు రూ.6,300 మాత్రమే పెట్టారు’ అని సదరు రైతు సమాధానమిచ్చారు. దీంతో సంబంధిత అధికారులపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ శాతం 8-12 ఉంటే మద్దతు ధర ఎందుకు చెల్లించడంలేదంటూ మందలించారు. అయితే రైతుల పంట నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ ఖరీదుదారులు అమాయక రైతుల దగ్గర తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడైంది.
రైతులకు మద్దతు ధర కల్పించాలని, మోసం చేసే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎంఏ అలీం, సెక్రటరీ ప్రవీణ్‌కుమార్‌లు బుధవారం పత్తి యార్డులో పర్యటించారు. పర్యవేక్షకులు, ఇతర సిబ్బందితో కలిసి స్వయంగా రైతుల వద్దకు వెళ్లి పంటను పరిశీలించారు. తేమ శాతం నిర్ధారణ పరీక్షలు చేసి వివరాలు నమోదు చేసుకున్నారు. తేమ శాతం తక్కువ ఉన్నప్పటికీ మద్దతు ధర రాని రైతులను గుర్తించారు. మద్దతు ధర ఇవ్వని కమీషన్ వ్యాపారులకు నోటీసులు జారీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. రైతుకు మద్దతు ధర కల్పించి కమీషన్ తీసుకోవాల్సిన అడ్తీ వ్యాపారులు.. అ పని చేయకుండా కేవలం కమీషనే ధ్యేయంగా పనిచేస్తున్న వారి వివరాలను సేకరించారు.
పత్తి క్రయవిక్రయాలపై కలెక్టర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు చేపట్టాం. ముఖ్యంగా యార్డులో తక్కువ ధరకు కోట్ చేసిన లాట్లను గుర్తించి సదరు రైతుల వద్దకు వెళ్తున్నాం. పంటను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధర లభించని పక్షంలో తొలుత కమీషన్ వ్యాపారికి నోటీసులు జారీ చేస్తాం. ఇప్పటికే కొందరు కమీషన్ వ్యాపారులను గుర్తించాం. ఉద్దేశపూర్వకంగా పేచీ పెట్టి సొమ్ము చేసుకునే ఖరీదుదారులపై దృష్టి సారించాం.
-ప్రవీణ్‌కుమార్, ఖమ్మం ఏఎంసీ సెక్రటరీ