ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) అందుబాటులోకి వచ్చి.. అమోల్డ్ స్క్రీన్‌ను టచ్ చేసిన అరక్షణంలోనే కోరుకున్నవన్నీ అరచేతిలోకి వచ్చిపడుతున్న నేటి ఆధునిక యుగంలో.. అభివృద్ధికి ఇంకా అందనంత దూరానే ఉంటున్నారు అమాయక ఆదివాసీలు. అడుగడుగునా అవాంతరాలు ఎదురైనా అడవిలోనే జీవిస్తారు. అడవినే నమ్ముకుంటారు. బాహ్యప్రపంచంలోకి అడుగు పెట్టేందుకు ససేమిరా అంటారు. వారి ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. నట్టడవిలో స్వచ్ఛతను ఆస్వాదిస్తున్నా.. మెరుగైన జీవనానికి మాత్రం ఇంకా వారు అల్లంతదూరానే ఉన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం.. వారిని ఆదరించింది. పోడు పట్టాలు, భగీరథ నీళ్ల వంటి వాటి ద్వారా వారి జీవనాన్ని ఓ దరికి చేర్చింది. కానీ, ఏడాదిన్నర క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాత్రం వారి బతుకులను మళ్లీ అగమ్యగోచరంలోకి నెట్టింది. ఆఖరికి, అటవీ సిబ్బందితో వారిపైకి యుద్ధానికి పంపిన దుస్థితులు తలెత్తాయి. ఏటా ఆగస్టు 9న జరుపుకునే ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీల జీవన శైలులు, వారి పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు వంటి అంశాలపై ప్రత్యేక కథనం.
-భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ)
అంతర్జాతీయంగా అంతరించిపోతున్న ఆదివాసీల సంరక్షణ కోసం ఐక్యరాజ్య సమితి చర్యలు చేపట్టింది. ఏటా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరపాలని 1994లో ప్రకటించింది. గిరిజనులకు ప్రత్యేక హక్కులు కల్పించేందుకు నిర్ణయించింది. ఇందుకోసం 1997లో నిర్వహించిన సమావేశానికి ప్రపంచంలోని అన్ని దేశాల ప్రతినిధులను ఆహ్వానించింది. 143 ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు సమావేశానికి హాజరై ఓటింగ్‌లో పాల్గొన్నాయి. సుమారు 20 దేశాలు మినహా మిగిలిన అన్ని దేశాల ప్రతినిధులూ.. గిరిజనులకు ప్రత్యేక హక్కులు కల్పించేందుకు, వారికోసం ప్రత్యేక చట్టాలు చేసేందుకు ఆమోదం తెలిపాయి. గిరిజనులకు ఉండే హక్కుల గురించి, వారికి ప్రభుత్వం అందించే పథకాల గురించి వారికి అవగాహన కల్పించేందుకు నాటి నుంచి ఏటా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటూ పోడు భూమిని సాగు చేసుకుంటూ బతుకులు వెళ్లదీస్తున్న గిరిపుత్రులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసానిచ్చారు. ప్రభుత్వ ఫలాలను వారి చెంతకు చేర్చారు. వారు సాగు చేసుకుంటున్న పోడు భూములపై హక్కులు కల్పించారు. ఆయా భూములకు రైతుబంధు పంటల పెట్టుబడి సాయాన్ని అందించారు. పోడు రైతులకూ రైతుబీమాని వర్తింపజేశారు. ఆవాస ప్రాంతాల్లో వారు నివసించే గూడేలకు కూడా మిషన్ భగీరథ పథకం ద్వారా శుద్ధజలాలను అందించారు. దీంతో గత ప్రభుత్వంపై వీరికి కొండంత భరోసా ఏర్పడింది. ఆ ప్రభుత్వ పాలనలో ఉన్నన్ని రోజులూ గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండాయి.
దట్టమైన అడవుల్లో బతుకులు వెళ్లదీస్తున్నప్పటికీ చిన్న చీమకు కూడా హాని తలపెట్టని ఆదివాసీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కర్కషంగా వ్యవహరిస్తోంది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాకముందే ఆదివాసీల బతుకులకు చిన్నాభిన్నం చేసేలా పాలన సాగిస్తోంది. పోడు భూములను అక్రమంగా సాగు చేస్తున్నారంటూ అటవీ అధికారులతో హెచ్చరికలు చేయిస్తోంది. అవి తమ భూములంటూ ఆదివాసీ గొంతెత్తినందుకు అదే అటవీ సిబ్బందితో అమాయక ఆదివాసీలపై దాడులు చేయిస్తోంది. బూర్గంపహాడ్ మండలం ఇరవెండి అటవీ ప్రాంతంలో ఇటీవల జరిగిన ఉదంతమే ఉదాహరణ.
ఏళ్లకేళ్లుగా అడవిని నమ్ముకొని పోడును సాగు చేసుకుంటూ జీవిస్తున్న ఆదివాసీలకు ఏకంగా ఆ పోడు భూములపై హక్కులు కల్పిస్తూ వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చిన పుణ్యం గత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అవుతుంది. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడి పోడు రైతుల్లో కేవలం 21 వేల మందికి మాత్రమే పోడు పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకుంది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ, ఆ తరువాత పోడు భూమి సాగు విషయంలో ఆదివాసీలకు, అటవీ అధికారులకు మధ్య దాడులు, ఘర్షణలు చోటుచేసుకునేవి. ఆ తరువాత గిరిజనులే కేసుల్లో చిక్కుకునేవారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ధ్యేయంతో గత ముఖ్యమంత్రి కేసీఆర్ మొన్నటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో.. ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములపై హక్కులు కల్పించారు. చరిత్రలో నిలిచిపోయేలా రాష్ట్రవ్యాప్తంగా అత్యధికంగా భద్రాద్రి జిల్లాలో 1,51,195 ఎకరాలను సాగు చేసుకుంటున్న 50,595 మంది రైతులకు పోడు పట్టాలు పంపిణీ చేశారు. ఆ భూములు సాగు చేసుకునేందుకు వారికి భరోసానిచ్చింది.