ఖమ్మం, జూన్ 1 నమస్తే తెలంగాణ ప్రతినిధి : ‘మా నిధులు మాకే.. మా ఉద్యోగాలు మాకే..’ అనే నినాదంతో తెలంగాణ ఆకాంక్ష తొలికేకను ప్రతిధ్వనించింది ఉమ్మడి ఖమ్మం జిల్లా. వలసవాదుల దోపిడీకి వ్యతిరేకంగా గొంతెత్తి గర్జించింది. సీమాంధ్ర పాలకవర్గాల ప్రాంతీయ వివక్షపై పిడికెళ్లెత్తింది. నాలుగున్నర కోట్ల ఆకాంక్షకు పురుడు పోసింది. తొలి దశ, మలి దశ ఉద్యమాల్లో మడమతిప్పని పోరాట పటిమను ప్రదర్శించింది ఉద్యమ ఖిల్లా. అమరుల త్యాగాలను గుండెలకత్తుకున్న ఖమ్మం మెట్టు.. స్వరాష్ట్ర సాధనలో అలుపెరగని పోరు చేసింది. తెలంగాణ ఉద్యమ చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచింది.
సీమాంధ్ర పాలకుల వివక్షకు, వలసవాదుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాల ఖిల్లా ఖమ్మం జిలా ‘జై తెలంగాణ’ అంటూ తొలికేక పెట్టింది. నిధులు, నీళ్లు, నియామకాల్లో వివక్షను తట్టుకోలేక 1969లోనే ‘జై తెలంగాణ’ అంటూ గర్జించింది. స్వరాష్ట్రం, స్వపరిపాలన కోరుతూ ప్రత్యేక రాష్ట్రం నినాదానికి పురుడుపోసింది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎందరో ముద్దుబిడ్డలు రక్త తర్పణం చేశారు. వీరుల త్యాగాలను పుణికిపుచ్చుకున్న పురిటిగడ్డ పోరుబిడ్డలు.. మలిదశ ఉద్యమంలోనూ మడమతిప్పలేదు. విద్యార్థులు, మేధావులు, కార్మికులు, కర్షకులు, ఉద్యమ పార్టీల నేతలు, కార్యకర్తలు నాటి పోలీసుల నిర్బంధాలను లెక్కచేయలేదు.
ఉద్యోగులు కూడా సీమాంధ్ర పాలకుల బెదిరింపులను పక్కన పెట్టి.. భావితరాల కోసం జీవితాలనే (కొలువులనే) పణంగా పెట్టి అలుపెరగని ఉద్యమాలు చేశారు. ఉద్యమ సారథి కేసీఆర్ కూడా ఆమరణ దీక్షకు పూనుకున్నారు. తెలంగాణలోని సబ్బండ వర్గాలూ ఆయనకు వెన్నుదన్నుగా నిలిచాయి. ఫలితంగా చివరకు పార్లమెంటు సాక్షిగా తెలంగాణ బిల్లు ఆమోద ముద్ర వేసుకుంది. 2014 జూన్ 2న స్వేచ్ఛావాయువులతో స్వరాష్ట్రం అవతరించింది. పోరాటాల పురిటిగడ్డ పులకించిపోయింది.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసత్వంతో విప్లవ భావజాలాన్ని పుణికి పుచ్చుకున్న ఖమ్మం బిడ్డలు.. ఉద్యోగాల్లో జరుగుతున్న అన్యాయంపై తిరుగుబాటు జెండా ఎత్తారు. ‘జై తెలంగాణ’ అంటూ తొలికేక పెట్టారు. ప్రాంతీయ వివక్ష, ముల్కీ, నాన్‌ముల్కీ అంశంపై 1969 జనవరి 8న తెలంగాణ ముద్దుబిడ్డ అన్నాబత్తుల రవీంద్రనాథ్ ప్రత్యేక నినాదంతో జెండాను భుజానికెత్తుకున్నారు.
ఖమ్మం గాంధీచౌక్‌లో అత్యంత ప్రజాస్వామ్య పద్ధతిలో ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఖమ్మానికే చెందిన సింగరేణి ఉద్యోగి కొలిశెట్టి రాందాసు, కైలాస్నాథ్, నిమ్మల శంకర్రావు, కవిరాజమూర్తి, కోలాహాలం వెంకటేశ్వరరావు, వీ రామస్వామి, అర్వపల్లి సుధాకర్, అర్వపల్లి విద్యాసాగర్ లాంటి సహచరులు వెన్నంటి ప్రోత్సహించగా అన్నాబత్తుల రవీంద్రనాథ్ ఒక్కరే.. జనవరి 8 నుంచి 22 వరకు దీక్షను కొనసాగించారు. ఆ పోరాటమే మహాత్తర తెలంగాణ ఉద్యమ సంగ్రామానికి నాంది పలికింది.
నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రొఫెసర్ జయశంకర్ సార్ చూపిన తొవ్వలో తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు బీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) ప్రత్యేకరాష్ట్ర ఆకాంక్షను భుజానికెత్తుకున్నారు. ‘కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో..’ అనే నినాదంతో 2009 నవంబర్ 29న ఆమరణ దీక్షకు దిగారు.
దీంతో గడగడలాడిన సీమాంధ్ర పాలకులు కేసీఆర్‌ను అదేరోజు అరెస్టు చేశారు. ఖమ్మంలో సమైక్యవాదం ఎక్కువగా ఉంటుందని, తెలంగాణ ఉద్యమంగా అంతగా ఉండదని భావించిన సీమాంధ్ర పాలకులు ఆయనను ఇక్కడికి తీసుకొచ్చారు. తద్వారా తెలంగాణ ఉద్యమాన్ని అణగదొక్కవచ్చని భావించారు. కానీ వారి భావన తప్పయింది. ఉద్యమసారథిని అరెస్టుచేసి ఖమ్మానికి తీసుకొస్తున్నారన్న విషయం తెలియగానే.. తెలంగాణ శక్తులన్నీ ఏకమయ్యాయి. ఆయనకు అండదండగా నిలిచి తెలంగాణ కాంక్షను చాటిచెప్పాయి.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసమే పురుడుపోసుకున్న టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్).. ఖమ్మం పురిటిగడ్డపై అలుపెరగని పోరాటం చేసింది. సొంతంగా చెప్పుకోదగ్గ బలం లేకున్నా ప్రజల మద్దతును కూడగట్టి రాష్ట్ర సాధనలో తనదైన రీతిలో కొట్లాడింది. తెలంగాణ వాదానికి మద్దతు కూడగట్టింది. అడుగడునా సీమాంధ్ర నేతల విగ్రహాలున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహాలను నెలకొల్పింది. ఉద్యమ గుమ్మాన తెలంగాణ సంప్రదాయ పండుగైన బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది.
రక్త తర్పణాలు, అక్రమ నిర్భంధాలు, అలుపెరుగని పోరాటాల ఫలితంగా 60 ఏళ్ల అనంతరం నాలుగున్నకోట్ల మంది తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమమైంది. ఫలితంగా 2014 జూన్ 2న పోరాటాల పురిటిగడ్డ పులకించి పోయింది. దేశ రాజధాని సాక్షిగా దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. తల్లి తెలంగాణను తలుచుకొని సబ్బండ వర్ణాలూ ఆనంద భాష్పాలు రాల్చాయి.
స్వేచ్ఛా వాయువులను పీల్చాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఒకరినొకరు గుండెలకు హత్తుకొని ‘జయహో తెలంగాణ’ అంటూ సెల్యూట్ చేశారు. నాటి నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఏటా జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. కానీ కాంగ్రెస్ పాలనా పగ్గాలు చేపట్టిన ఈ ఏడాదిన్నరలో రెండుసార్లు తెలంగాణ అవతరణ దినోత్సవాలు జరిగాయి. అయినప్పటికీ ఉమ్మడి జిల్లా ప్రజలు స్వచ్ఛమైన ఉద్యమ మాధుర్యాన్ని తనివితీరా అనుభూతి చెందలేకపోతున్నారు.
కొత్తగూడెం టౌన్, జూన్ 1:రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం, భద్రాద్రి కలెక్టరేట్లను అధికారులు విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీంతో జిల్లా అధికారుల కార్యాలయాల సముదాయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు దీపకాంతులతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. అవతరణ వేడుకల కోసం ఖమ్మం పరేడ్ గ్రౌండ్ కూడా ముస్తాబైంది.