ఖమ్మం వ్యవసాయం, జూన్ 16 : మృగశిర కార్తె ప్రారంభమై సగంరోజులు దాటినా, నైరుతి రుతుపవనాలు ప్రవేశించి పక్షంరోజులు కావస్తున్నా.. ఆశించిన మేర వర్షపాతం నమోదుకాలేదు. గత వారంరోజుల నుంచి వరుణుడు నిత్యం ఊరిస్తూ ఉసురుమనిపిస్తున్నాడు. ఎన్నో ఆశలతో సాగు చేపట్టాలనుకుంటున్న అన్నదాతలు ఆకాశం వైపు చూస్తున్నారు. తెల్లారింది మొదలు ఈ రోజైన భారీ వర్షం కురవకపోతదా.. విత్తనాలు నాటుకోలేకపోతామా అని కొందరు రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మరికొందరు రైతులు ఇప్పటికే ఆయా మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురవడంతో పత్తి విత్తనాలు విత్తారు. జూన్ సగంరోజులు గడిచిపోయినప్పటికీ నైరుతి రుతుపవనాలు కేంద్రీకృతమైనప్పటికీ వర్షాలు కురవకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. వానకాలం ప్రారంభమై, విత్తనాలు సైతం కొనుగోలు చేసిన అన్నదాతలు దిగాలు పడుతున్నారు. గత సంవత్సరం సీజన్ ఆరంభంలో వరుణుడు కరుణించడం, సకాలంలో వర్షాలు కురవడంతో సాగు పనులు సకాలంలో పూర్తి చేసుకున్నారు. ఈ ఏడాది సైతం అదే పరిస్థితి పునరావృతం అవుతుందనే ఉద్దేశంతో వ్యవసాయశాఖ అధికారులు సైతం ముందస్తుగానే రాయితీ విత్తనాల పంపిణీ చేపట్టారు. జిల్లాలో అత్యధికంగా సాగు అయ్యే పత్తి పంటకు సంబంధించి సైతం విత్తన కొరత రాకుండా ఉండేందుకు ఆయా కంపెనీల డీలర్లు గోడౌన్ల్లో విత్తనాలను నిల్వ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్న ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో వానకాలం సాగుపై అన్నదాతల ఆశలు సన్నగిల్లుతున్నాయి. అయితే నైరుతి రుతుపవనాల ప్రభావంతో మరో రెండు, మూడ్రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
నేటివరకు ఖమ్మం జిల్లావ్యాప్తంగా వానకాలం సాగుకు సంబంధించి రైతులు 51,023 ఎకరాల్లో వివిధరకాల పంటలు సాగు చేశారు. పత్తి 35వేల ఎకరాలు, వరినారు మడులు 7 వేల ఎకరాలు, పెసర 3 వేల ఎకరాల్లో సాగు చేశారు. ఇతర పంటలు మరో 450 ఎకరాల్లో సాగు చేశారు. జూన్లో సాధారణ వర్షపాతం 105 మిల్లీమీటర్లు కాగా నేటివరకు జిల్లావ్యాప్తంగా సరాసరి 66 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సింగరేణి, తిరుమలాయపాలెం, ఖమ్మంఅర్బన్, సత్తుపల్లి, మధిర మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదు కాగా మిగిలిన అన్ని మండలాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదైంది. దీంతో ఆరుతడి, ఇతర పంటల సాగు విస్తీర్ణంపై అయోమయం నెలకొంది. అయితే ఈ నెల చివరివరకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించడంతో భారీ వర్షపాతం నమోదు కోసం రైతులు వేచి చూస్తున్నారు.
కొద్దిరోజుల క్రితం ఓ మోస్తరు వర్షం కురవడంతో అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ఇప్పటికే విత్తనాలు నాటుకున్న రైతులు వర్షాల కోసం ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. మరికొందరు రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. నగరంలో ప్రైవేట్ విత్తన, ఎరువుల షాపులతోపాటు సహకార సంఘాల కార్యాలయాలు అన్నదాతల రాకతో కళకళలాడాయి. ఈ సంవత్సరం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏ ఒక్క రైతుకు విత్తన కొరత రాకుండా ఉండేవిధంగా టీ సీడ్స్ కార్పొరేషన్ అధికారులు సొసైటీలకు విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ సంవత్సరం 74 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో విత్తనాలను విక్రయించనున్నారు. అయితే మరో రెండురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సంబంధిత అధికారులు ప్రకటించడంతో రైతులు పూర్తిస్థాయిలో విత్తనాలు విత్తుకునేందుకు సిద్ధమవుతున్నారు.