భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 2 (నమస్తే తెలంగాణ): సీతారామ ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువ పనులను పూర్తిచేసి మూడు పంప్‌హౌస్‌లను ప్రారంభించామని, సీతారామ నీటి విడుదలతో రైతులకు ఎంతో మేలు జరుగుతున్నదని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళిశాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దిన వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ప్రగతి మైదానంలో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కలెక్టర్, ఎస్పీ రోహిత్రాజులతో కలిసి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.
అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 1,57,574 ఎకరాల కొత్త ఆయకట్టు, చిన్నతరహా చెరువుల కింద 42,953 ఎకరాల స్థిరీకరించడం ప్రతిపాదించబడిందని, సీతమ్మ సాగర్ బహుళార్ధక సాధక ప్రాజెక్టు కోసం 3,123 ఎకరాలు భూ సేకరణ పూర్తి అయిందని చెప్పారు. మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులైన పెద్దవాగు, తాలిపేరు, కిన్నెరసాని ద్వారా 37,060 ఎకరాలకు, చిన్నతరహా నీటిపారుదల వనరుల ఆయకట్టు కింద 1,29,058 ఎకరాలకు నీటి పారుదల జరుగుతుందని తెలిపారు. భూ భారతి రెవెన్యూ గ్రామసభల్లో దరఖాస్తులను అందజేయాలని పేర్కొన్నారు. జిల్లాను అన్నిరంగాల్లో మొదటిస్థానంలో నిలపడంలో ప్రజలు, ఉద్యోగులు, ప్రతి ఒక్కరూ పని చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. రవాణా, రాష్ట్ర రోడ్డు, రవాణా సంస్థ, పశుసంవర్ధక, అగ్నిమాపక, వైద్య శాఖలు చేపడుతున్న పలు కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన శకటాలు ప్రదర్శించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ వేడుకల్లో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందన, కొత్తగూడెం ఆర్డీవో మధు, తహసీల్దార్ పుల్లయ్య, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.