ఇల్లెందు రూరల్, సెప్టెంబర్ 29: ‘దేవుడా.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మన్నించు..’ అంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భగవంతుడిని వేడుకున్నారు. ‘ఆగస్టు 15లోపు రైతులందరికీ రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానంటూ సాక్షాత్తూ మీమీదే ఒట్టు వేసిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఆ ఒట్టును గట్టున పెట్టారు. మీ సాక్షిగా ఇచ్చిన మాటను తప్పారు. మీమీదే ఒట్టు వేసి మాట తప్పిన ముఖ్యమంత్రిని మీరే పెద్ద మనసుతో క్షమించండి’ అంటూ పూజలు చేశారు.
పంట రుణాల రుణమాఫీ అంశంపై మాట తప్పిన ముఖ్యమంత్రిని మన్నించాలంటూ భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు మండలంలోని ఒడ్డుగూడెం గ్రామంలోని హనుమాన్ ఆలయం వద్ద హనుమంతుడి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ‘రుణమాఫీ విషయంలో రైతులనేగాక సాక్షాత్తూ మిమ్ములను కూడా మోసం చేశారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘సాక్షాత్తూ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి.. తాను ఇచ్చిన మాటను నెరవేర్చలేదు.
అటు రైతులను, ఇటు మిమ్ములను మోసం చేశారు. మీరే దయ చూపి ఆయనను క్షమించండి’ అంటూ వేడుకున్నారు. రాష్ట్ర ప్రజలందరినీ కాపాడాలని, ఆయురారోగ్యాలతో ఉంచాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగ మండల ఇన్చార్జి భూక్యా సురేశ్‌నాయక్, ఉద్యమ నాయకులు, బీఆర్ఎస్ నేతలు అజ్మీరా భావ్‌సింగ్, పూనెం లింగమ్మ, జోగా శేషగిరి, సుజాత్, ఘాజీ, అజ్మీరా రాందాస్, జాన్‌బాబు, భూక్యా శ్రీను, రామకృష్ణ, స్వామి, అశోక్, మంగీలాల్, ధర్మ, వీరు, వెంకన్న, రాములు, వీరయ్య, భద్రయ్య, శంకర్, ప్రేమ్, రాకేశ్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.