ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 29 : పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల తనిఖీకి విద్యాశాఖ అధికారులు ప్రత్యేక బృందాలను నియమించారు. సబ్జెక్టు మార్కులు 100 కాగా.. ఫార్మెటివ్ అసెస్మెంట్ విధానంలో 20 మార్కులకు పరీక్షలు నిర్వహించి వాటి ఆధారంగా విద్యార్థికి మార్కులు కేటాయిస్తారు. వార్షిక పరీక్షల్లో 80 మార్కులకు ప్రశ్నపత్రాన్ని అందజేస్తారు. 20 మార్కులను పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులే మూల్యాంకనం చేసి కేటాయిస్తారు. ఈ మార్కులు, సమాధాన పత్రాలను పరిశీలించి పాఠశాలలు సక్రమంగా మార్కులు నమోదు చేశాయా? లేదా? అనే అంశంపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలు జిల్లాలో ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లోనూ జరుగుతాయి.
తనిఖీలకు వెళ్లిన అధికారుల బృందంలో ముగ్గురు సబ్జెక్టు నిపుణులు ఉంటారు. వీరు ఆయా సబ్జెక్టుల ఆధారంగా ప్రతి పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన ఇంటర్నల్ మార్కులను పరిశీలిస్తారు. సంబంధిత మార్కుల ప్రొఫార్మాను పోల్చుతూ విద్యార్థి రాసిన సమాధానపత్రాలు సరిగ్గా ఉన్నాయో.. లేదో.. సరిచూస్తారు. దీంతోపాటు విద్యార్థి రాసిన సమాధానాలకు ఉపాధ్యాయులు సరిగ్గా మార్కులు వేశారా? ఏమైనా తప్పులు దొర్లాయా? ఇతరాలేమైనా ప్రభావం చూపాయా? అనే కోణంలోనూ పరిశీలిస్తారు. విద్యార్థి హాజరు పట్టికలు, ప్రాజెక్ట్ రిపోర్టులను పరిశీలిస్తారు. సబ్జెక్టు నిపుణులు పరిశీలించిన వాటిలో హెచ్చు తగ్గులు ఉంటే సంబంధిత బృంద నాయకుడికి వివరిస్తారు. తనిఖీల్లో లోపాలుంటే ఆ నివేదికను సంబంధిత తనిఖీ కన్వీనర్ డీసీఈబీ సెక్రటరీ ద్వారా డీఈవోకి అందజేస్తారు.
జిల్లాలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల తనిఖీలను మండల విద్యాశాఖాధికారులు సమన్వయం చేయనున్నారు. ఎంఈవోలు సూచించిన విధంగా ఆయా బృందాలు పాఠశాలల్లో తనిఖీలు చేయనున్నాయి. యాజమాన్యాలవారీగా ఎయిడెడ్, బీసీ వెల్ఫేర్, ప్రభుత్వ, ఐటీడీఏ, కేజీబీవీలు, టీఎస్ఎంఎస్, ప్రైవేట్, టీఎస్ఆర్ఎస్, టీఎస్డబ్ల్యూఈఎస్, జిల్లా పరిషత్ పాఠశాలల్లో కలిపి జిల్లాలో మొత్తం 16,514 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు రోజుకు రెండు లేదా మూడు స్కూళ్ల చొప్పున 423 పాఠశాలల్లో తనిఖీలు చేయనున్నారు. బృందాలకు అనుగుణంగా ఒక్కో టీముకు 10 నుంచి 13 వరకు స్కూళ్లను కేటాయించారు. ఒకే ప్రాంతంలో ఉండి.. దగ్గరగా ఉన్న స్కూళ్లయితే రోజుకు మూడు చేసేలా సూచనలు చేశారు.
సమాధానపత్రాల్లో మార్కులను నిశితంగా పరిశీలించాలి. విద్యార్థి సరిగ్గా సమాధానాలు రాయకపోయినా అత్యధిక మార్కులు కేటాయిస్తే సంబంధిత బాధ్యులపై చర్యలుంటాయి. సమాధాన పత్రాల పరిశీలనలో ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో తనిఖీలకు వెళ్లే బృందాలకు వివరించాం. ప్రతి పాఠశాలలో తనిఖీ చేసే సమయంలో అన్ని అంశాలను వారికి అందజేసిన పత్రాల్లో నమోదు చేస్తారు. తనిఖీ చేసే బృందాలను ఎంఈవోలు మార్గదర్శనం చేస్తుంటారు.
పదో తరగతి ఇంటర్నల్ మార్కుల తనిఖీల్లో మండల విద్యాశాఖాధికారుల సహాయంతో సబ్జెక్టు నిపుణులను నియమించారు. ప్రతి బృందానికీ సీనియర్ ప్రధానోపాధ్యాయుడు ఉంటారు. తనిఖీల వివరాలను ప్రతి రోజూ డీఈవోకి నివేదిస్తాం. మండల విద్యాశాఖాధికారులు ఆయా మండలాల్లో పాఠశాలలను ఆయా బృందాలకు కేటాయిస్తారు.
ఇంటర్నల్ మార్కుల తనిఖీలకు నిపుణులైన ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. ఇంటర్నల్ మార్కుల ప్రక్రియలో పాల్గొనేందుకు ఖమ్మంలో 58 బృందాలను నియమించారు. ప్రతి బృందానికి ఒక సీనియర్ ప్రధానోపాధ్యాయుడు నాయకత్వం వహిస్తారు. అతడి ఆధ్వర్యంలో ప్రతి బృందానికీ ముగ్గురు సబ్జెక్టు నిపుణులను నియమించారు. తెలుగు, హిందీ సబ్జెక్టులకు ఒకరు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులకు మరొకరు, సోషల్, సైన్స్ సబ్జెక్టులకు ఇంకొకరు చొప్పున ఉంటారు. వీరికి కేటాయించిన సబ్జెక్టుల ఆధారంగా పాఠశాలల్లో తనిఖీలు చేస్తారు. తనిఖీలు ఎలా చేయాలి? ఏయే అంశాలు ప్రాతిపదికగా ఉండాలి? అనే వాటిపై మండలస్థాయి సమావేశంలో నిర్ణయించారు. తనిఖీల సమయంలో సందేహాలు, విధుల సమాచారం వంటి వివరాలను డీసీఈబీ సెక్రటరీ నారాయణకు అందజేస్తారు.