ఖమ్మం వ్యవసాయం, మార్చి 11 : మార్కెట్లో తేజా మిర్చి ధర దోబూచులాడుతోంది. నిన్న, మొన్నటి వరకు అంతంతమాత్రంగా పలికిన రేటు ఇప్పుడు తిరోగమనంలో పయనిస్తుండడంతో మార్కెట్కు సరుకు తరలించిన రైతులు దిగులు చెందుతున్నారు. గత ఏడాది క్వింటా మిర్చి గరిష్ఠ ధర రూ.25 వేలు పలికింది. ఈ ఏడాది గరిష్ఠ ధర రూ.22 వేలు మాత్రమే పలికింది. అది కూడా ఒకటి రెండు రోజులకే పరిమితమైంది. మార్కెట్లో క్రయవిక్రయాలు జరిగిన చివరి రోజు క్వింటా గరిష్ఠ ధర రూ.21,150 పలకగా.. సోమవారం జెండాపాటలో గరిష్ఠ ధర రూ.20,650కే పరిమితమైంది. మధ్య ధర రూ.19 వేలు కాగా.. కనిష్ఠ ధర రూ.13,800 పలికింది.
దీంతో రోజు వ్యవధిలోనే క్వింటాకు రూ.550 తగ్గింది. ధర పతనమవుతుండడంతో మార్కెట్కు సరుకును తీసుకొచ్చిన రైతులు అమ్మకుండానే కోల్డ్ స్టోరేజీలకు తరలిస్తున్నారు. దీంతో ఉదయం జెండాపాట సమయానికి 20 వేల బస్తాలు మాత్రమే యార్డుకు వచ్చాయి. జెండాపాటలో కేవలం రూ.20,650 పలకగా.. అంతకంటే తక్కువ ధర పడిన రైతులు విక్రయించడానికి అయిష్టత చూపారు. రాబోయే రోజుల్లో చైనా కంపెనీలు తిరిగి తేజా మిర్చి కొనుగోళ్లు ప్రారంభిస్తే మరింత ధర రావొచ్చనే ఉద్దేశంతో కోల్డ్ స్టోరేజీలలో పంటను నిల్వ చేస్తున్నారు.