కొణిజర్ల, నవంబర్ 29 : మండలంలో పోలింగ్ ఏర్పాట్లకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కొణిజర్ల మండలంలో మొత్తం 27 పంచాయతీల్లో 60 పోలింగ్స్టేషన్లు (135 నుంచి 194 బూత్ వరకు) ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ స్టేషన్లలో 48,826 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 23,798 మంది, మహిళలు 25027 మంది ఉన్నారు. ఇతరులు ఒకరు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు మొత్తం 13, 14, 15, 16, 17 రూట్లుగా విభజించారు. సుమారు 300 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. కొణిజర్ల జిల్లా పరిషత్ పాఠశాలలో యూత్ ఆదర్శ పోలింగ్ కేంద్రం, తనికెళ్లలో ఆదర్శ మహిళా పోలింగ్ కేంద్రం, చిన్నగోపతిలో దివ్యాంగ ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తనికెళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఆదర్శ మహిళా పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ వీ.పీ.గౌతమ్ బుధవారం సాయంత్రం సందర్శించారు. పోలింగ్ సిబ్బందికి పలుసూచనలు, సలహాలు అందజేశారు. సిబ్బందికి భోజన వసతి, పోలింగ్ కేంద్రంలో లైటింగ్, సీసీ కెమెరాలు పరిశీలించారు.
వైరాటౌన్, నవంబర్ 29 : నేడు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సిబ్బంది విధుల పట్ల అలసత్వం వహించకుండా ఓటింగ్‌ను సమగ్రంగా నిర్వహించాలని కలెక్టర్ గౌతమ్ అన్నారు. వైరా నియోజకవర్గ కేంద్రంలో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పోలీస్ కమిషనర్ విష్ణువారియర్, రిటర్నింగ్ అధికారి సత్యప్రసాద్‌తో కలిసి బుధవారం పరిశీలించి మాట్లాడారు. ఎన్నికల విధులపై పోలింగ్ సిబ్బందికి, అధికారులకు అవగాహన కల్పించారు. ఎన్నికల విధులను సమగ్రంగా నిర్వహించాలని కోరారు. ఎన్నికల విధుల పట్ల అలసత్వం వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు నిశ్పక్షపాతంగా ఓటింగ్ నిర్వహించాలని కోరారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలకు ఎన్నికల విధులకు వెళ్లే పోలింగ్ మెటీరియల్ ఈవిఎం వాహనాలను కలెక్టర్ పరిశీలించి భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఏసీపీ రెహమాన్, ఎన్నికల స్పెషలాఫీసర్లు, పోలీస్ సిబ్బంది, సీఆర్పీఎఫ్ బలగాలు పాల్గొన్నారు.
వైరాటౌన్, నవంబర్ 29 : వైరా నియోజకవర్గంలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 252 ఉండగా, అందుకు గాను పోలింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు 1124 మంది విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల అబ్జర్వర్లు 54 మంది, వెబ్ కాస్టింగ్ 20 మంది, 750 మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల సామగ్రికి పహారా కాయనున్నారు. 352 వీవీ ప్యాడ్లు, 315 బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు సిద్ధం చేశారు.
కారేపల్లి, నవంబర్ 29 : నేడు జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణ అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మండల వ్యాప్తంగా 61పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 61మంది బూత్ లెవల్ అధికారులు, 5గురు సెక్టార్ ఆఫీసర్లతో పాటు ప్రతి బూత్‌కు 11మంది సిబ్బంది చొప్పున విధుల్లో పాల్గొననున్నారు. మండలంలో 45,011మంది ఓటర్లు ఉండగా వారిలో పురుషులు 22,178, స్త్రీలు 22,830 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరే ఓటర్లకు ఎండ టెంట్లను ర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల ఆవరణలతో పాటు పరిసర ప్రాంతాలలో సీసీ కెమెరాలు అమర్చారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులను తీసుకువెళ్లేందుకు ప్రత్యేక సిబ్బందిని, ట్రైసైకిళ్లను అందుబాటులో ఉంచారు.