అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అడుగులు పడుతున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం ఒక్కో పనిని చకచకా పూర్తి చేస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేయగా.. 9,28,983 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఓటర్ల జాబితా సవరణకు సెప్టెంబర్ 19 వరకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించగా.. తుది జాబితా అక్టోబర్ 4న విడుదల కానున్నది. ఎన్నికల సంఘం ఇచ్చిన అవకాశాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
– అశ్వారావుపేట, ఆగస్టు 24
అశ్వారావుపేట, ఆగస్టు 24: త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల కోసం అధికారులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. మొదటి ప్రాధాన్యంగా ఓటర్ల తుది ఓటర్ల జాబితాను సన్నద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారులు విడుదల చేశారు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 9,28,983 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 4,54,286 మంది. స్త్రీలు 4,74,663, ఇతరులు 34 మంది ఉన్నారు. జిల్లా మొత్తంలో ఓటర్లలో మహిళలు 20,377 మంది అధికంగా ఉన్నారు. వచ్చే నెల 19 వరకు ఓటరు జాబితా సవరణలకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. అక్టోబర్ 4న ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది. ఇటీవల విడుదల చేసిన ఓటర్ల ముసాయిదా జాబితాలను పోలింగ్ కేంద్రాల వారీగా ప్రజల పరిశీలన కోసం ప్రదర్శనలో ఉంచారు. జిల్లాలోని 23 మండలాల్లో మొత్తం 698 ప్రాంతాల్లో 1,095 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
23aspt2
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తుది ఓటర్ల జాబితాను రూపొందించే ప్రక్రియలో నిమగ్నమయ్యారు. కొత్త ఓటర్ల నమోదుతోపాటు ఇప్పటి ఉన్న ఓటర్లు తమ కార్డుల్లో మార్పులు, చేర్పులకు సెప్టెంబర్ 19 వరకు అవకాశం కల్పించారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు 2,32,502 మంది ఉన్నారు. అత్యల్పంగా భద్రాచలం నియోజకవర్గంలో 1,44,118 మంది ఉన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ మహిళా ఓటర్లే అధికం. సెప్టెంబర్ 19 వరకు 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు కచ్చితంగా కొత్త ఓటు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా పాత ఓటర్లు తమ పేరు, ఇంటి పేరు, చిరునామా, నియోజకవర్గం వంటి మార్పుల కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. కొత్త ఓటు కోసం ఫాం-6, చేర్పులు, మార్పుల కోసం ఫాం 7, 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కార చర్యలు తీసుకోనున్నారు.
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పటికే ముసాయిదా జాబితా విడుదల చేశాం. కొత్త ఓట్ల నమోదుతోపాటు ఇప్పటి ఉన్న ఓటర్లలో పేర్ల మార్పులు, చేర్పుల కోసం వచ్చే నెల 19 వరకు అవకాశం ఉంది. అర్హులైన యువతీ యువకులు ఓటు ప్రాముఖ్యతను గుర్తించాలి. ఓటు హక్కును నమోదు చేసుకోవాలి. అలాగే చిరునామా, పేర్లు, నియోజకవర్గం మార్పుల కోసం సంబంధిత దరఖాస్తులను సమర్పించారు. వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కార చర్యలు తీసుకుంటాం. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 4న విడుదల అవుతోంది. ఎన్నికల సంఘం ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
-పర్సా రాంబాబు, అదనపు కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం
01