కారేపల్లి, ఫిబ్రవరి 7: రాష్ట్రంలో ఏడాది కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని, గత కేసీఆర్ ప్రభుత్వ పథకాలకే పేర్లు మార్చి హడావిడి చేయడం తప్ప 14 నెలల కాలంలో వారు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ఆరోపించారు. మండలంలోని భాగ్యనగర్‌తండాలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత కళ్లముందు కనిపిస్తున్నదని, మళ్లీ కేసీఆర్ పాలననే ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. గడిచిన పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందిందనే విషయాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కళ్లముందుంచారన్నారు. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికే దివాలా తీసిందని, ఆ పార్టీ ప్రజాప్రతినిధులే పాలనపై అసమ్మతి వ్యక్తం చేయడం ఇందుకు నిదర్శనమని విమర్శించారు.
ఎడాపెడా 420 హామీలు ఇచ్చి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని అసెంబ్లీ స్పీకర్ ప్రసాదరావు స్వయంగా ఒప్పుకున్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నే ప్రభుత్వ పనితీరును ఎండగట్టడం రేవంత్‌రెడ్డికి సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ శాఖ మంత్రి అడ్డంగా దోచుకుంటున్నాడని జడ్చర్ల ఎమ్మెల్యే బహిరంగంగా దూషిస్తుంటే.. పాలనా తీరు ఎలా ఉందో ప్రజలు అర్థమవుతోందన్నారు. ఢిల్లీకి మూటలు పంపడం కోసమే హైడ్రాను తెరపైకి తెచ్చారన్నారు.
పార్టీని నమ్ముకున్న వారికి నాయకత్వం సముచిత స్థానం కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు ముత్యాల సత్యనారాయణ, ఉన్నం వీరేందర్, రావూరి శ్రీనివాసరావు, ధరావత్ మంగీలాల్, ముత్యాల వెంకట అప్పారావు, అడపా పుల్లారావు, బానోత్ కుమార్, శివరాత్రి అచ్చయ్య, బత్తుల శ్రీనివాసరావు, బానోతు రాందాస్, ఇస్లావత్ బన్సీలాల్, సిద్ధంశెట్టి నాగయ్య, జాలా సాంబ, షేక్ ఖాజావలి, యాకుబ్ పాషా, షేక్ సలీం పాల్గొన్నారు.