కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)తో ఓటర్ల జాబితాలో ఉండే తప్పిదాలు ఈసారి సక్కబడతాయా అనే సందేహం ఓటర్లలో నెలకొంది. ఇప్పటివరకు ఉన్న ఓటర్ల జాబితాలో పేరు, ఫొటో, పుట్టినతేదీ వంటి తప్పిదాలతోపాటు అనేకం చోటుచేసుకునేవి. దీంతోపాటు అధికారులు సూచించిన సెల్ నెంబర్లింక్ తప్పనిసరి కాగా ఆధార్‌లింక్ అనేది ఓటరు ఇష్టానికి వదిలేశారు. భారత ఎన్నికల సంఘం ప్రధానంగా దేశంలో పుట్టి పెరిగిన వారికే ఓటుహక్కు కల్పించాలని, కాందీశికులుగా ఇతర దేశాల నుంచి వలస వచ్చిన, అక్రమ చొరబాటుదారులను ఏరివేసే కార్యక్రమంలో భాగంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరుతో వివిధ రాష్ర్టాల్లో ఓటర్ల జాబితాను ఒడగట్టే పనిలో ఉంది. దీంతోపాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో దీనిని అమలు చేసి అక్రమంగా, నిబంధనలకు విరుద్ధంగా ఓటుహక్కు పొందిన వారిని గుర్తించి వారి ఓట్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ వివిధ రాజకీయ పక్షాలకు, ఓటర్లకు మాత్రం అనేక అపోహలు, సందేహాలు ఉన్నాయి. -మామిళ్లగూడెం, జూన్ 28
పలు రాష్ర్టాల్లో నిర్వహించిన సర్‌తో లక్షల కొలది ఓట్లు గల్లంతయ్యాయని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అన్ని రాష్ర్టాల్లో పాగా వేసేందుకు అక్రమంగా ఓట్లను తొలగిస్తున్నదని వివిధ రాజకీయ పక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. సర్ తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి నివేదికలు, ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపులు చేస్తుందో అన్న సందేహాల మధ్యన ‘సర్’ నడుస్తున్నది. ఇప్పటికే అప్రమత్తమైన రాజకీయ పార్టీలు ప్రధానంగా బీఆర్ఎస్తోపాటు ఇతర పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించి ఓట్లు గల్లంతు కాకుండా పర్యవేక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.
పట్టణ ప్రాంతాల్లో బీఎల్వోలకు కష్టాలే…
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు, మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 25 నుంచి జూలై 24వ తేదీ వరకు నెలరోజులపాటు బీఎల్వోలు ఓటర్లకు ఫామ్-6తో పాటు ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సేకరించే పనిలో పడ్డారు. ఇప్పటికే గత నెలరోజులపాటు ముందస్తు సర్ సర్వేలు చేసిన బీఎల్వోలు గత 2002 ఓటర్ల జాబితాతో ప్రస్తుతం ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ చేశారు. అయినా పూర్తిస్థాయిలో ఓటర్లను మ్యాప్ చేయలేకపోయారు. అదేవిధంగా అక్షర దోషాలు, అడ్రస్సులు, ఇతర తప్పిదాలు ఉన్నవారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది. ముందస్తు సర్‌లో ఖమ్మం నియోజకవర్గం పరిధిలో 3,28,203 మంది ఓటర్లకు 1,78,323 మందిని మ్యాప్ చేశారు. ఇంకా మరో 1,49,880 మంది ఓటర్లను మ్యాప్ చేయాల్సిన అవసరం ఉంది.
బీఎల్వోలు మ్యాపింగ్‌లో కేవలం 54.33 శాతం ఓటర్లను మాత్రమే చేయగలిగారు. వాటిలో 49,510 మంది ఓటర్లు అనోమాలిస్గా నమోదైనట్లు గుర్తించారు. మరో 46శాతం మ్యాపింగ్ చేస్తే పూర్తిస్థాయిలో అనోమాలిస్ ఓటర్లు వివరాలు వెల్లడి అవుతుందని, వారికి తమ ఓటును జాబితాలో ఉండేందుకు అవసరమైన అవకాశం కల్పించేందకు ఫామ్-6తో పాటు అసరమైన, ఎన్నికల సంఘం సూచించిన ధ్రువీకరణ పత్రాలు అందించిన తరువాత అభ్యంతరాలను స్వీకరించి ఓటును తొలగించడం లేదా జాబితాలో ఉంచడం అనేది చేయనున్నారు. పట్టణ ప్రాంతాల్లో ప్రధానంగా ఓటర్ల అడ్రస్‌లు గుర్తించేందుకు బీఎల్వోలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అద్దె ఇండ్లలో ఉన్నవారు తమ ఇంటిని మరో ప్రాంతానికి మారడంతో ఈ ఇబ్బంది పడుతుంటే, ఇంటికి తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, విదేశాలకు, రాష్ర్టాల్లో ఉండే ఓటర్లతో ఇక్కట్లు తప్పడం లేదు. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లను దొరకపుచ్చుకోవడంలో బీఎల్వోలకు సవాల్‌గా మారింది.
గ్రామీణ ప్రాంతాల్లో కొంతమేరకు మెరుగ్గానే..
సర్ సర్వే గ్రామీణ ప్రాంతాల్లో కొంతమేరకు మెరుగ్గానే సాగుతుంది. పాలేరు నియోజకవర్గంలో ఉన్న 2,45,885 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2,08,393 మంది ఓటర్లను మ్యాపింగ్ చేశారు. ఇంకా 37,492 మందిని మ్యాంపింగ్ చేయాల్సి ఉంది. మొత్తంగా 84.75 శాతం మ్యాపింగ్ పూర్తికావడంతో వారిలో 41,206 మంది అనోమాలిస్ ఓటర్లుగా గుర్తించారు. మధిర నియోజకవర్గ పరిధిలో 2,26,126 మంది ఓటర్లు ఉండగా 1,95,593 మంది ఓటర్లు మ్యాపింగ్ అయ్యారు. ఇంకా 30,533 మంది ఓటర్లను మ్యాపింగ్ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 86.5 శాతం పూర్తి చేశారు. వారిలో 32,767 మంది ఓటర్లు అనోమాలిస్గా గుర్తించారు. వైరా నియోజకవర్గంలో 1,96,475 మంది ఓటర్లు ఉండగా 1,64,345 మంది ఓటర్లు మ్యాపింగ్ అవ్వగా ఇంకా 32,130 మంది ఓటర్లను మ్యాప్ చేయాల్సి ఉంది.
ఇప్పటివరకు 83.53 శాతం ఓటర్లు మ్యాప్ చేయగా వారిలో 28,242 మంది అనోమాలిస్ ఓటర్లుగా ఉన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 2,47,092 మంది ఓటర్లు ఉండగా 2,18,753 మంది ఓటర్ల మ్యాప్ చేయపడ్డారు. మరో 28,339 మంది ఓటర్లను మ్యాప్ చేయాల్సిన అవసరం ఉంది. మ్యాప్ చేసిన 88.53 మంది ఓటర్లలో 30,085 మంది అనోమాలిస్గా గుర్తించారు. మొత్తంగా జిల్లావ్యాప్తంగా 1,24,3781 మంది ఓటర్లకు 9,65,407 మంది ఓటర్లను మ్యాపంగ్ పూర్తి చేశారు. ఇంకా 2,78,374 మంది ఓటర్ల మ్యాపింగ్ కొనసాగుతుండగా జిల్లావ్యాప్తంగా 77.62 శాతం మ్యాపింగ్ పూర్తి చేయగా వారిలో 1,81,805 మంది ఓటర్ల అనోమాలిస్గా గుర్తించారు. ఇలా గుర్తించిన ఓటర్లకు జూలై 24వ తేదీలోపు ఎన్నికల సంఘం నిర్దేశించిన ధ్రువీకరణ పత్రాలతో వారి ఓటులో ఉన్న లోపాలను సరిచేసుకునేందుకు అవకాశం ఇస్తారు. ఓటరు సమర్పించిన పత్రాలు, వివరాలపై అభ్యంతరాలు స్వీకరించిన తరువాత తుది జాబితాను ప్రకటించనున్నారు.
ధ్రువపత్రాల కోసం పరుగులు
ఓటరు జాబితాలో తమ పేర్లు ఉండాలి అంటే ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ధ్రువీకరణ పత్రాలు అవసరంకావడంతో ఓటర్లు ఆయా ధ్రువీకరణ పత్రాల కోసం పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే మీసేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్న ఓటర్లు అవసరమైన పత్రాలకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. విద్యావంతుల్లో 50శాతం మందికి ధ్రువీకరణ పత్రాలు ఉన్నప్పటికీ నూతనంగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన పత్రాలు తప్పనిసరి కావడంతో వాటి కోసం దరఖాస్తులు చేయాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా నిరక్ష్యరాసులుగా ఉన్నవారు ధ్రువీకరణ పత్రాలను తమ భర్త లేదా పిల్లల ధ్రువీకరణపత్రాల సహాయంతో మీసేవా కేంద్రాల ద్వారా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. దీంతో తహసీల్దార్ కార్యాలయంలో ఈ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియలో ఆయా విభాగాల సిబ్బంది తలమునకలవుతున్నారు. ఒకపక్క విద్యా సంవత్సరం ప్రారంభం, మరోపక్క సర్ కోసం దరఖాస్తుదారులు ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తులు చేయడంతో తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బందికి పని భారం తప్పడం లేదు. రెండింటికి నిర్దేశించిన సమయంలో ధ్రువీకరణ పత్రాలు ఎంతో ఆవశ్యకతను కలిగి ఉన్నాయి.