ఖమ్మం రూరల్, జూన్ 9: సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని ఎమ్మెల్సీ తాతా మధు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి గడపకూ అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేర్చినది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు. అడగకుండానే అన్నీ అందించిన గొప్ప నాయకుడిగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా ఖమ్మం రూరల్ మండలం పోలెపల్లిలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన సంక్షేమ సంబురాల్లో వారు మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమంలో ఒకప్పటి పాలేరు నియోజకవర్గానికి, ఇప్పటి పాలేరు నియోజకవర్గాన్ని ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు.
నియోజకవర్గంలో ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు అందాయని, మరికొన్ని ఇళ్లకు రెండు మూడు పథకాలు కూడా అందాయని ప్రజలందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అడగకుండానే అన్నీ అందిస్తున్న సీఎం కేసీఆర్ ప్రజలందరూ మరోసారి ఆశీర్వదించాలని కోరారు. మూడోసారీ ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అనంతరం, మలి విడతలో మంజూరైన గొర్రెలను ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కలిసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అలాగే ఆయా మండలాల ప్రజలకు మంజూరైన ఇళ్ల స్థలాల హక్కు పత్రాలు, బీసీ రుణాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, చెక్కులు, ఆసరా పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, ఎంపీపీ బెల్లం ఉమ, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, తహసీల్దార్ టీ.సుమతోపాటు నాలుగు మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.