కొత్తగూడెం ఎడ్యుకేషన్/ కొత్తగూడెం క్రైం/ మామిళ్లగూడెం, డిసెంబర్ 15: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-2లోనూ సగానికి సగమే హాజరు శాతం నమోదైంది. ఇటీవలి గ్రూప్-3 పరీక్షల్లోనూ ఇలాగే జరిగింది. దీంతో గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను దాదాపు సగం మంది అభ్యర్థులే రాస్తున్నట్లవుతోంది. తాజాగా భద్రాద్రి జిల్లాలో ఆదివారం జరిగిన గ్రూప్-2 మొదటి రోజు పరీక్షకు కూడా సగానికంటే కొంచెం ఎక్కువమంది అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లాలో మొదటి రోజు పరీక్ష రెండు సెషన్లనూ ప్రశాంతంగానే జరిగింది. పోలీసులు అధికారులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. జిల్లాలో మొత్తం 38 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 13,466 మంది అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు అధికారులు హాల్‌టికెట్లు జారీ చేశారు.
తొలి రోజు ఉదయం పరీక్షకు 6,324 మంది హాజరు కాగా, 7,142 మంది గైర్హాజరయ్యారు. హాజరు 46.96 శాతంగా నమోదైంది. మధ్యాహ్నం పరీక్షకు 6,248 మంది హాజరు కాగా, 7,218 మంది గైర్హాజరయ్యారు. 46.4 శాతంగా హాజరు శాతం నమోదైంది. పాల్వంచ అనుబోస్ ఇంజినీరింగ్ కాలేజీ పరీక్ష కేంద్రాన్ని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తనిఖీ చేశారు. కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్ కాలేజీ, పాల్వంచ అనుబోస్ ఇంజినీరింగ్ కాలేజీ పరీక్ష కేంద్రాలను ఎస్పీ రోహిత్‌రాజు పరిశీలించి బందోబస్తును పర్యవేక్షించారు. కాగా, పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఎస్పీ రోహిత్రాజుని అక్కడ బందోబస్తు విధుల్లో ఉన్న సిబ్బంది తనిఖీ చేసి లోపలికి అనుమతించడం విశేషం.
ఖమ్మం జిల్లాలో ఆదివారం మొదటి రోజు జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్-2 రెండు సెషన్ల హాజరు శాతం వివరాలను ఆ జిల్లా అధికారులు వెల్లడించలేదు. రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ హజరుశాతాన్ని వెల్లడించినప్పటికీ ఖమ్మం జిల్లా అధికారులు మాత్రం హాజరుశాతం గోప్యంగా ఉంచారు. జిల్లాలో 85 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 28,101 మంది అభ్యర్థులు హాజరవుతారని ప్రకటించారు. కానీ వివరాలను వెల్లడించలేదు.