మయూరిసెంటర్, జూలై 10: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలం జగన్నాథపురం గ్రామం వద్ద శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’ కాస్త ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్న ఈ సభకు రైతులతోపాటు స్వయం సహాయ సంఘాల మహిళలు, యువత, కాంగ్రెస్ కార్యకర్తలను భారీగా తరలించేందుకు ఏర్పాట్లు చేసిన అధికారులు టీజీఎస్ఆర్టీసీ నుంచి సుమారు 80 శాతం బస్సులను వినియోగించారు.
అయితే ఇక్కడ ప్రభుత్వ అధికారులు, పరిపాలన పెద్దలు ముందస్తుగా ప్రజలకు బస్సులు అందుబాటులో ఉండవని, తమ తమ ప్రయాణాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని సూచన చేయడంలో విఫలమయ్యారు. దీంతో రోజు వారీగా బస్సులు నడుస్తాయని భావించి ప్రయాణం చేసిన ప్రజలకు ప్రభుత్వం తీరుతో ఇబ్బందులు తప్పలేదు. గంటల తరబడి ఆయా బస్టాండ్‌ల్లో నిరీక్షించిన ప్రజల ప్రయాణానికి బస్సులు రాకపోవడంతో నానా అవస్థలు పడ్డారు. చిన్నపిల్లలు, వృద్ధులు, దూరప్రాంతాల ప్రయాణికుల పరిస్థితి మరీ దారుణంగా మారింది.
ఆర్టీసీ బస్సులను ముఖ్యమంత్రి సభకు వినియోగించడంతో ప్రయాణికులకు బస్సులు లేవని తెలిసిన ప్రైవేటు ట్రావెల్స్, ఆటోవాలాలు, కార్లు, ఇతర ప్రయాణికులను తరలించే వాహనాల వారు కనీస చార్జీలకు డబుల్, త్రిబుల్ వసూలు చేయడంతో ఆర్థిక భారాన్ని ప్రయాణికులు మోయక తప్పలేదు. ముఖ్యమంత్రి సభకు ఖమ్మం రీజియన్‌వ్యాప్తంగా 425 బస్సులను వినియోగించిన ప్రభుత్వం, సభకు ముందురోజు నిర్వహించిన రైతుమేళా కార్యక్రమానికి 110 బస్సులను వినియోగించారు. దీంతో జిల్లాలో రెండురోజులపాటు ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్ఆర్టీసీ నుంచి ప్రభుత్వం ముఖ్యమంత్రి సభకు 3,576 బస్సులను వినియోగించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం సభల పేరుతో ప్రయాణికులను ఇబ్బందులు పెట్టడం సరికాదు. దూర ప్రయాణాలు చేసేవారికి ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు ప్రయాణం చేయాల్సిన మేము అర్థాంతరంగా ఖమ్మంలో దిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా 125 కిలోమీటర్లు మూడుగంటలపాటు ప్రయాణం చేయాల్సిన మాకు ఏమి చేయాలో తెలియని పరిస్థితి.
-మహేశ్వరి, భద్రాచలం ప్రయాణికురాలు
ప్రభుత్వం నిర్వహించే సభలకు ప్రైవేటు వాహనాలను వాడుకోవాలి కానీ ఇలా ఆర్టీసీ బస్సులను వినియోగించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సభ జరిగే రోజు బస్సులు బంద్ అని ప్రకటిస్తే ఇలా అవస్థలు పడటం తప్పేది కదా. తొర్రూరు నుంచి మణుగూరు వెళ్లేందుకు బయలుదేరి ఖమ్మం బస్టాండ్‌లో బస్సుల కోసం మధ్యాహ్నం వరకు ఎదురుచూడాల్సిన దుస్థితి. బస్సులు వస్తాయో రావో చెప్పేవారే లేరు.
-ఎంజర్ల పుల్లయ్య, మణుగూరు ప్రయాణికుడు