పెనుబల్లి, ఆగస్టు 26: సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం నంబర్‌వన్ స్థానంలో ఉందని, వృద్ధులు, దివ్యాంగుల కష్టాలను పట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. నూతనంగా మంజూరైన పింఛన్‌కార్డులను ఇంటింటికీ లబ్ధిదారులకు అందించే కార్యక్రమంలో భాగంగా పెనుబల్లి మండలంలో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం 57 ఏళ్లు నిండిన వృద్ధులకు సీఎం కేసీఆర్ నూతన పింఛన్లు మంజూరు చేశారన్నారు. ఏరుగట్ల, లంకపల్లి, కొత్తలంకపల్లి, మండాలపాడు, కర్రాలపాడు, బ్రహ్మళ్లకుంట, గంగదేవిపాడు గ్రామాల్లోని లబ్ధిదారులకు నూతన పింఛన్‌కార్డులను పంపిణీ చేశారు. రాష్ట్రం ఏర్పడక ముందు రూ.75, రూ.200 చొప్పున వస్తున్న పింఛన్లతో వృద్ధులు, దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ సిద్ధించి ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఈ పింఛన్లను రూ.2,016, రూ.3,016కు పెంచినట్లు వివరించారు.
ఇప్పుడు కొత్తగా మరికొన్ని పింఛన్లను మంజూరు చేయడంతో అర్హుల కళ్లలో ఆనందం కన్పిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కోరారు. పింఛన్ల పంపిణీకి వెళ్తుంటే ప్రతి ఊరిలోనూ వృద్ధులు ఎంతో సంతోషంగా స్వాగతం పలుకుతున్నారని అన్నారు. తొలుత ఆయా గ్రామాల్లో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకటరావు ఆధ్వర్యంలో మేళతాళాలు, డీజేలతో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు స్వాగతం పలికారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు విద్యాచందన, సూర్యనారాయణ, లక్కినేని అలేఖ్య, చెక్కిలాల మోహన్‌రావు, చెక్కిలాల లక్ష్మణ్‌రావు, కావూరి మహాలక్ష్మి, రమాదేవి, నాగరాజు, వాల్మీకీ, కనగాల వెంకటరావు, పసుమర్తి వెంకటేశ్వరరావు, ముక్కర భూపాల్ రెడ్డి, లక్కినేని వినీల్, చీకటి రామారావు, తాళ్లూరి శేఖర్‌రావు, తేళ్లూరి నాగేశ్వరరావు, భూక్యా ప్రసాద్, వంగా నిరంజన్ గౌడ్ పాల్గొన్నారు.
పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలి
పల్లెలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. మండలంలోని ఏరుగట్ల గ్రామంలో శుక్రవారం ఆయన దోమల మందు పిచికారీ చేశారు.