నమస్తే నెట్వర్క్ : యంగ్ అండ్ డైనమిక్ లీడర్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటన శనివారం ఖమ్మం జిల్లాలో ఉత్సాహంగా సాగింది. తొలుత హెలికాఫ్టర్‌లో కొణిజర్ల మండలం అంజనాపురం చేరుకున్నారు. ప్రజాప్రనితిధులు, బీఆర్ఎస్ నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. తొలుత యువనేత గోద్రెజ్ కంపెనీ నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఖమ్మం నగరానికి విచ్చేసి మున్నేరుపై తీగల వంతెన, ఇరువైపులా ఆర్సీసీ వాల్స్, నగరంలో పలుచోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నగరంలోని లకారం ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఎస్బీఐటీ పక్కన ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ పార్క్‌ను ప్రారంభించి క్రీడాకారులను షేక్ హ్యాండ్ ఇచ్చి ఉత్సాహపరిచారు. మంత్రి కేటీఆర్‌ను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. విద్యార్థులకు షేక్‌హ్యాండ్ ఇస్తూ ఆయన సందడి చేశారు. మంత్రితో సెల్ఫీ దిగేందుకు యువతీ యువకులు ఆసక్తి కనబరిచారు. సభల్లో మంత్రి ఇచ్చిన ప్రసంగం బీఆర్ఎస్ శ్రేణుల్లో నయా జోష్ నింపింది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా మంత్రి పర్యటనలో పాల్గొన్నారు.