పినపాక, ఆగస్టు 10 : తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో తోగ్గూడెం పంచాయతీ పరిధిలోని సుమారు 300 ఎకరాలకు సాగునీరు అందించే లొటారిగండి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం బుధవారం హైడ్రాలిక్ క్లియరెన్స్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన పత్రాలను ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై త్వరలోనే పూర్తిస్థాయి అనుమతులు తీసుకొస్తానని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తెలిపారు. నియోజకవర్గంలో ఒక్క రైతు కూడా సాగునీటి కోసం ఇబ్బందులు పడొద్దనే విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. లొటారిగండి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయించి ఈ ప్రాంత రైతుల ఆకాంక్షను నెరవేరుస్తానని ఆయన పేర్కొన్నారు.
లొటారిగండి ప్రాజెక్ట్‌ను నిర్మిస్తే మా పంచాయతీలో రెండు పంటలు పుష్కలంగా పండుతాయి. రైతులు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. హైడ్రాలిక్ క్లియరెన్స్‌కు కృషి చేసిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు తోగ్గూడెం గ్రామపంచాయతీ, రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.
-కల్తి శ్రీలత, సర్పంచ్ తోగ్గూడెం
ప్రాజెక్ట్ నిర్మాణానికి కృషి చేస్తున్న పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు ఆయకట్టు రైతులు బ్రహ్మరథం పట్టనున్నారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల పక్షపాతి అయిన తెలంగాణ ప్రభుత్వానికి రైతుల మద్దతు పుష్కలంగా ఉంది. లొటారిగండి ప్రాజెక్ట్ నిర్మిస్తే ఈ ప్రాంత భూములన్నీ సస్యశ్యామలం అవుతాయి.
-బండ మనోజ్, బీఆర్ఎస్ యువజన విభాగం నాయకుడు