ఖమ్మం రూరల్, డిసెంబర్ 16 : గత బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలో రైతు భరోసా అమలు చేయాలని, రైతుల ఆందోళనలపై నిర్బంధం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కమిటీ పిలుపు మేరకు ఖమ్మం జిల్లా రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు రైతు సంఘం నాయకులతో కలిసి సోమవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాగం హేమంతరావు మాట్లాడుతూ రైతు భరోసాపై కాంగ్రెస్ సర్కార్ ఏడాది కాలంగా ఊరిస్తున్నదని, వాయిదాలతోనే కాలం వెళ్లదీస్తున్నదని ఆరోపించారు. రైతు రుణమాఫీపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తున్నదని, రూ.2 లక్షలలోపు రుణాలు తీసుకున్న అనేక మందికి ఇప్పటివరకు మాఫీ కాలేదని పేర్కొన్నారు. నాల్గవ దఫా రూ.3 వేల కోట్ల రుణమాఫీ ప్రకటించామని చెప్పి నేటివరకు రైతుల ఖాతాల్లో జమ చేయలేదని, కేవలం 50 శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేశారన్నారు.
ధాన్యం, పత్తి కొనుగోళ్లలో అధికార యంత్రాంగం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఈ నెల 28వ తేదీ నుంచి అమలు చేయబోయే ఆర్థిక చేయూత పథకాన్ని భూమిలేని ప్రతి పేదవాడికి అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం తహసీల్దార్ పీ రాంప్రసాద్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహ్మద్ మౌలాన, రైతు సంఘం నాయకులు మిడకంటి చిన్న వెంకటరెడ్డి, పుచ్చకాయల సుధాకర్, చందర్రావు, బి.రాంకోటి, పెద్ద వెంకటరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, భాస్కర్, వెంపటి రాము తదితరులు పాల్గొన్నారు.