అశ్వారావుపేట, డిసెంబర్ 26: పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ పథకం ఇంటింటి సర్వేను సాంకేతిక సమస్య వెంటాడుతోంది. యాప్ సక్రమంగా పని చేయకపోవడంతో సర్వే సిబ్బంది నానా ఇబ్బంది పడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే సర్వే గడువులోగా ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తికాదనే చర్చ జరుగుతోంది. డిసెంబర్ 31వ తేదీలోగా సర్వే పూర్తిచేయాల్సి ఉన్నప్పటికీ మరో నెల అంటే వచ్చే ఏడాది జనవరి చివరి వరకు కూడా సర్వే పూర్తి అవుతుందా.. లేదా అనే అనుమానం సిబ్బందిని కలవరపెడుతోంది. ఇందిరమ్మ పథకం అర్హుల గుర్తింపులో సిబ్బంది ఆపసోపాలు పడుతున్నారు. సాంకేతిక సమస్యలు ఇంటింటి సర్వేకు ఆటంకాలు కలిగిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో నెట్ సిగ్నల్ సమస్యతో సర్వే ముందుకు సాగడంలేదు. పట్టణాల్లో సైతం సర్వర్ మొరాయిస్తున్నది. వివరాలు అన్ని నమోదు చేశాక ఇక్కసారిగా మళ్ళీ సర్వే మొదటికి వచ్చేస్తున్నది. అన్ని సక్రమంగా జరిగితే ఒక్కొక్క సిబ్బంది రోజుకు కనీసం 40 నుంచి 50 కుటుంబాల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ సాంకేతిక సమస్యతో కనీసం 10 నుంచి 15 కుటుంబాల వివరాల నమోదు గగనమవుతోంది. రెవెన్యూ ఉద్యోగులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది సర్వేలో పాల్గొంటున్నారు.
ప్రభుత్వానికి అందిన దరఖాస్తులను పరిశీలించి పేదల వివరాలను ఇందిరమ్మ యాప్‌లో సర్వే సిబ్బంది నమోదు చేయాల్సి ఉంటుంది. మొత్తం 13 కాలమ్స్‌ను పూర్తిచేయాలి. మొదటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాలి. సొంతింట్లో ఉంటున్నారా.. లేదా అద్దె ఇంట్లో ఉంటున్నారా అనే వివరాలను యాప్‌లో పొందపరచాలి. ప్రస్తుతం నివాసం ఉంటున్న ఫొటో, ఇంటి స్థలం ఉంటే దానికి సంబంధించిన పత్రాలనూ యాప్‌లో నమోదు చేయాల్సిందే. ఖాళీ స్థలం ఉంటే దాని వివరాలు నమోదు చేశాక, సంబంధిత వ్యక్తికి ఆ స్థలం ఉందా.. లేక వ్యక్తి కుటుంబసభ్యుల పేరిట ఉందా అన్న వివరాలను నమోదు చేసుకోవాలి. సర్వే ప్రక్రియ ఇలా ఉంటే వివరాలు నమోదు సమయంలో యాప్ సర్వర్లు మొరాయించడంతో సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఒక్కో ఇంటివద్దనే గంటల కొద్దీ యాప్‌తో యుద్ధం చేయాల్సి వస్తున్నది. అధికారులు బృందాలుగా ఏర్పడి కేటాయించిన ప్రాంతాల్లో యాప్ ద్వారా సర్వే నిర్వహిస్తున్నారు. పరిశీలించిన దరఖాస్తుల్లో సగంమంది అనర్హులుగానే సిబ్బంది అనుమానిస్తున్నారు. గత ఏడాది ప్రజాపాలన గ్రామసభల్లో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక కోసం అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.
సాంకేతిక సమస్యతోపాటు దరఖాస్తుదారులు అందుబాటులో లేకపోవడంతో సర్వే ముందుకు సాగడం లేదు. ప్రధానంగా సర్వర్ సమస్యే సిబ్బందిని ఇబ్బందికి గురిచేస్తున్నది. నియోజకవర్గవ్యాప్తంగా మొత్తం 69,422 దరఖాస్తులు ప్రజాపాలన గ్రామసభల్లో అధికారులు స్వీకరించగా వీటిలో 52,283 మంది ఇళ్ళ కోసం ఎదురుచూస్తున్నారు. అశ్వారావుపేట మండలం నుంచి 16,184, దమ్మపేట నుంచి 15,653, ములకలపల్లి నుంచి 10,838, అన్నపురెడ్డిపల్లి నుంచి 5,560, చండ్రుగొండ మండలం నుంచి 9,048 మంది దరఖాస్తుదారులు ఇందిరమ్మ ఇంటికోసం పడిగాపులు పడుతున్నారు. వీరిలో రేవంత్‌రెడ్డి సర్కార్ ఎంతమందిని అర్హులుగా గుర్తిస్తారోననే ఆందోళన అర్జీదారులకు నిద్రపట్టనీయడం లేదు. మొదటివిడతగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు మంజూరు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం అర్హుల ఎంపికను పారదర్శకంగా ఎలా చేపడుతుందన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు కనీసం 35శాతం సర్వే కూడా పూర్తికానట్లు స్పష్టమవుతోంది.
ఇందిరమ్మ ఇంటి సర్వేలో సాంకేతిక సమస్యను గుర్తించాం. సర్వర్ పనిచేయని ప్రాంతాల్లో ఆఫ్‌లైన్‌లోనే వివరాలు నమోదు చేయాలని సర్వే సిబ్బందికి స్పష్టంచేశాం. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోగా సర్వే పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాం.