ఖమ్మం అర్బన్, నవంబర్ 27: అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని, పీఆర్సీ అమలు చేయడంతోపాటు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ పక్కన అమరువీరుల స్థూపం వద్ద 30 గంటల నిరాహార దీక్షను గురువారం చేపట్టారు. దీక్షా శిబిరాన్ని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకర భిక్షంగౌడ్ ప్రారంభించారు. తొలుత తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి దీక్షను చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కట్టా శేఖర్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ పెండింగ్ బిల్లులు, పెన్షనర్స్ బకాయిలు, పెండింగ్ డీఏలు, పీఆర్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి.. ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి, జేఏసీ నాయకులతో బకాయిలు చెల్లిస్తామని చెప్పి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదన్నారు.
వందలాది మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొంది ఏడాది దాటినా పెన్షనరీ బెనిఫిట్స్ చెల్లించకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం పెండింగ్ డీఏలు, పీఆర్సీ ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు. దీక్షా కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి నాయకులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు మోత్కూరి మధు, వెంకటనర్సయ్య, కేవీఎస్ చలపతిరావు, చిత్తలూరి ప్రసాద్, కేవీ రమణ, జీవీ రమణ, రంగారావు, యలమద్ది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.