కొణిజర్ల, ఏప్రిల్ 18: ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కమీషన్ల రాజ్యం నడుస్తున్నదని, మంత్రులందరూ తమ స్థాయికి తగ్గట్లు తీరొక్క దందాలకు పాల్పడుతున్నారని, కాంట్రాక్టర్ల నుంచి 10 నుంచి 12 శాతం కమీషన్లు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ ఆరోపించారు. రామనర్సయ్యనగర్లో ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బీఆర్ఎస్ కార్యకర్త జటపిట రవిని శుక్రవారం ఆయన పరామర్శించారు. కారణాలు అడిగి తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు.
అనంతరం బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పదేళ్ల పాలనలో కేసీఆర్ ప్రపంచంలోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే సత్తా కూడా లేదన్నారు. 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బహుబలి కేసీఆర్ బయటకు రానున్నారని, కాంగ్రెస్ పతనానికి ఈ సభ వేదిక కానుందని అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
అనంతరం రామనర్సయ్యనగర్లో వడ్డెర సంఘం కమ్యునిటీ హాల్ నిర్మాణానికి తన నిధుల నుంచి రూ.5 లక్షలు అందజేయనున్నట్లు తెలిపారు. జటపిట రవికి రూ.10 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం రైతులు ఆరబోసిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. ఎటువంటి తరుగు లేకుండా పూర్తి పైకం చెల్లించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు పోట్ల శ్రీనివాసరావు, కొర్రా కాంతమ్మ, ముత్యాల నాగేశ్వరరావు, కిలారు మాధవరావు, దొడ్డపునేని రామారావు, పోగుల శ్రీను, పాసంగులపాటి శ్రీను, ముత్యాల నాగేశ్వరరావు, అద్దంకి చిరంజీవి, రాయల నాగేశ్వరరావు, బానోతు రాంబాబు, దావా విజయ్, షేక్ సోందు, భూక్యా రాందాస్, జర్పుల వెంకన్న, నున్నా రామకృష్ణ, రహీం, రవీంద్ర, వెంకటచలం, బైరు వెంకటేశ్వర్లు, బాలు పాల్గొన్నారు.