ఖమ్మం, అక్టోబర్ 30 : వెయ్యిమంది రేవంత్‌రెడ్డిలు వచ్చినా తెలంగాణ నుంచి కేసీఆర్‌ను తుడిచివేయలేరని, తెలంగాణ ఉన్నంతవరకు కేసీఆర్ అనే వ్యక్తి సజీవంగా నిలిచి ఉంటారని, కేసీఆర్‌ను ఇంచుకూడా కదిలించడం ఎవరితరం కాదని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అన్నారు. బుధవారం ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం(తెలంగాణ భవన్)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి తాతా మధు మాట్లాడారు. కేటీఆర్‌ను అడ్డుపెట్టుకుని కేసీఆర్ అనే వ్యక్తిని లేకుండా చేశానని, హరీశ్‌రావును అడ్డం పెట్టుకుని కేటీఆర్‌ను లేకుండా చేస్తానని రేవంత్‌రెడ్డి పగటికలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమం అంటే ఏమిటో తెలియని రేవంత్ కేసీఆర్ చరిత్రను లేకుండా చేయడమంటే తెలంగాణ రాష్ర్టాన్ని లేకుండా చేయడమేనని, ఒకవేళ తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతాడేమోనని అనుమానం వ్యక్తంచేశారు.
తెలంగాణ ఉద్యమకారులపై తుపాకి ఎక్కుపెట్టిన రేవంత్‌కు త్యాగాల గురించి ఏమి తెలుసునని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలపై రూ.18,500 కోట్ల విద్యుత్ భారం పడకుండా ఆగిందని అన్నారు. విద్యుత్ చార్జీలు పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ డిస్కంలకు ఆదేశాలు ఇచ్చిందని, దానిని ఎదుర్కొనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ప్రజలపై ఏ విధంగా భారం పడుతుందో లెక్కలతో సహా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు వివరించడం జరిగిందని, ఫలితంగా ప్రజలపై రూ.18,500 కోట్ల భారం పడకుండా కాపాడమని, ఇది ముమ్మాటికీ బీఆర్ఎస్ విజయమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ 11నెలల కాలంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. రేవంత్‌కు నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
దేశ చరిత్రలో అతితక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత పొందిన ఏకైక సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకే మంత్రులు కొండా సురేఖ, పొన్నం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఇదంతా కాంగ్రెస్ నాయకుల వ్యూహం అన్నారు. రేవంత్ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని, కాంగ్రెస్ పాలన భ్రష్టు పట్టిందని తాతా మధు ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులకు జైళ్లు కొత్తకాదని, పోరాటం కొత్తకాదన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసే వరకు ఊరుకోమని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇంతవరకు ప్రభుత్వం నుంచి స్పష్టతలేదన్నారు. గన్నీ బ్యాగులు అందించలేదన్నారు. బహిరంగ మార్కెట్లో క్వింటా ధాన్యం ప్రైవేటు వ్యాపారులు రూ.1,500లకు కొంటున్నారన్నారు.
అన్నిరకాల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఇండ్లు నిర్మించుకొని పూర్తికాని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని అన్నారు. వివిధ స్టేజీల్లో ఉన్న లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయాలని సండ్ర అధికారులను కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బెల్లం వేణుగోపాల్, జర్పుల లక్ష్మణ్, పాశబోయిన వీరన్న, పాలేపు రామారావు, వీరూనాయక్, పగడాల నరేందర్, సతీష్, దొడ్డా శ్రీనివాసరావు, కూసంపూడి రామారావు, కట్టా అజయ్‌కుమార్, దుగ్గిరాల వెంకట్‌లాల్, కాటమనేని వెంకటేశ్వరరావు, పోట్ల శ్రీను, శీలంశెట్టి వీరభద్రం, కొండబాల వెంకన్న, రాంరెడ్డి, వెంకట్రావ్, యాగంటి శ్రీనివాసరావు, వీరమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.