ఖమ్మం సిటీ, మే 20 : తెలంగాణలో పాలన, అభివృద్ధి, సంక్షేమం సహా అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఉమ్మడి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. అందుకని, మరో రెండున్నరేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని స్పష్టం చేశారు. ఖమ్మం, మధిర, ఇల్లెందు, వైరా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో చేపట్టబోయే డిజిటల్ సభ్యత్వ నమోదు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, కార్యకర్తల భాగస్వామ్యం, జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి.. ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (తెలంగాణ భవన్)లో బుధవారం విస్తృతంగా చర్చ జరిగింది.
దీనికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తదితరులు హాజరవగా.. ముఖ్యఅతిథిగా తక్కెళ్లపల్లి మాట్లాడారు. కాంగ్రెస్ అసమర్థ పాలనతో అల్లాడిపోతున్న యావత్ తెలంగాణ ప్రజలు.. మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ తొలిసారిగా అత్యాధునిక డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నదన్నారు. గ్రామస్థాయి నుంచి నాయకత్వం ఎలాంటి బేషజాలకు వెళ్లకుండా సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. ఉద్యమకారులకు, పార్టీ నిజమైన అభిమానులు, అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. గులాబీ సైనికులందరికీ సభ్యత్వం అందేలా పారదర్శకంగా కార్యాచరణ ఉండాలని ఆకాంక్షించారు.
బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు బాధ్యత తాజా, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తీసుకోవాలని తక్కెళ్లపల్లి రవీందర్రావు సూచించారు. ప్రతీ నియోజకవర్గంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ‘పార్టీ సభ్యత్వమే లక్ష్యం – బీఆర్ఎస్ విజయమే ధ్యేయం’గా క్యాడర్ క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు. నిజాయితీగా పనిచేసేవారికి భవిష్యత్తులో తగిన గుర్తింపు, సముచిత అవకాశం తప్పకుండా లభిస్తుందని అన్నారు. జిల్లాలోని ముగ్గురు మంత్రులు కమీషన్లు, సంపాదన మీదనే దృష్టి సారించారని, రెండున్నరేండ్లలో తట్టెడు మట్టి కూడా తీయలేదని ధ్వజమెత్తారు. నిరుపేదల గుడిసెలు కూల్చి, పేదలకు కన్నీళ్లు మిగిల్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, ఇతర నేతలు హరిసింగ్, ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, బానోత్ మంజుల, గిరిబాబు, ఎండీ ఖమర్, దిండిగాల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలే బీఆర్ఎస్కు బలమని, కేసీఆర్‌ను మరోసారి సీఎం చేయడమే అందరి లక్ష్యమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలూ కైవసం చేసుకునేంత వరకు విశ్రమించేది లేదన్నారు. సభ్యత్వ నమోదులో భాగంగా ప్రతీ బూత్‌కు ఇద్దరు చొప్పున కార్యకర్తలతో కూడిన కమిటీలను నియమించుకుని నిబద్ధతతో పనిచేయాలన్నారు. ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో అలాంటి వారికే కమిటీల్లో ప్రాధాన్యం కల్పించేలా కార్యాచరణ ఉండాలన్నారు. ఉద్యమకారులకు సైతం పెద్దపీట వేసి సమన్వయంతో కలిసి ముందుకు సాగాలన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ ఏకమయ్యాయని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజాబలం దండిగా ఉన్న బీఆర్ఎస్ను ఏమీ చేయలేవని తేల్చిచెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో తెలంగాణతోపాటు ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందిందని గుర్తుచేశారు. జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా వారి దృష్టి కేవలం సంపాదన మీదే ఉందని ఆరోపించారు. అంతేతప్ప ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం వారికి ఏమాత్రం లేదని విమర్శించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ బలమని; నాయకులు, కార్యకర్తలే బలగమని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సభ్యత్వ నమోదు ప్రక్రియను శ్రేణులు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. రెండేళ్లుగా ఉద్యమకారులు, నాయకులు, కార్యకర్తలు పార్టీ పటిష్టతకు అందించిన సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలూ గెలుచుకొని తీరుతామన్నారు. ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ జెండాను మోస్తున్నారో రానున్న కాలంలో వారందరికీ ప్రాధాన్యం ఉంటుందని అన్నారు.