హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 11: దేశంలోని ప్రజా వ్యతిరేక బీజేపీ పాలన నుండి ప్రజలకు విముక్తి కల్పించేందుకే సిపిఐ పోరాటం కొనసాగిస్తున్నదని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కేంద్రంలో సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. వేయిస్తంభాల దేవాలయం నుంచి ప్రదర్శన హనుమకొండ రస్తా మీదుగా పబ్లిక్ గార్డెన్ వరకు కొనసాగింది. సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు దేశంలో మార్పు కోసం ఆగష్టు 6న జిల్లాలో ప్రారంభమైన పాదయాత్ర వారం రోజులుగా జిల్లాలో కొనసాగిన మంగళవారం ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో వెంకట్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
ప్రజాసమస్యల పరిష్కారం కోసం సిపిఐ ప్రచార జాత పాదయాత్ర నిర్వహిస్తుందని, బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలే దాని పతనానికి దారి తీస్తాయని, దేశంలో మార్పు కోసం సిపిఐ పోరాటం సాగిస్తోందన్నారు. బీజేపీ 12 ఏళ్ల పాలనలో ప్రజలకు ఉపయోగకరమైన ఒక మంచి పని చేయలేకపోయిందని, ధరలను అరికట్టడంలో, ఉద్యోగాల కల్పనలో విఫలమైందని, మహిళా రిజర్వేషన్ విషయంలో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా దానికి నియోజకవర్గాల పునర్విభజన బిల్లును జోడించి ఆమోదింపజేసుకోవడానికి కుట్ర పన్నారన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలు అనేకమార్లు లీక్ అయి లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారని, చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందని, బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తిని క్రమబద్ధంగా దెబ్బతీస్తుందన్నారు.
ఢిల్లీ విద్యార్థుల పోరాట స్పూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సిపిఐ రాష్ర్ట సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ర్ట కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, సీనియర్ రాష్ర్ట నాయకులు టి.వెంకట్రాములు, రాష్ర్ట సమితి సభ్యులు సిరబోయిన కరుణాకర్, ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, సీనియర్ నాయకులు మోతె లింగారెడ్డి, జిల్లా నాయకులు ఉట్కూరి రాములు, ఎన్ఏ స్టాలిన్, కర్రె లక్ష్మణ్, మునిగాల బిక్షపతి, బత్తిని సదానందం, బాషబోయిన సంతోష్, కొట్టెపాక రవి, ఏదునూరి వెంకట్రాజం, వేల్పుల సారంగపాణి, నేదునూరి రాజమౌళి, నకీర్త ఓదెలు, యేషబోయిన శ్రీనివాస్, మాలోతు శంకర్, మెట్టు శ్యామ్‌సుందర్‌రెడ్డి, శనిగరపు రాజ్‌కుమార్, కొట్టె వెంకటేష్, ఉట్కూరి ప్రవీణ్, రాసమల్ల దీనా, గుంటి రాజేందర్, రమేష్, డి.ప్రవీణ్ పాల్గొన్నారు.